మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో కర్రల సమరం రద్దు..?


మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో కర్రల సమరాన్ని నివారించడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో బన్నీ ఉత్సవాలపై సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ పకీరప్ప, జాయింట్ కలెక్టర్ రవి పట్టన్ శెట్టి, ఆదోని rdo బాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ ఈ నెల 5 నుండి 9 వరకు దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో దాదాపు లక్ష మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని ఈ మేరకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దేవరగట్టు ఆలయ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరంగా చేపట్టడంతో పాటు పార్కింగ్ ప్రదేశాల్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. త్రాగునీటికి ఇబ్బంది లేకుండా పది ప్రదేశాలను గుర్తించి కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. మొబైల్ టాయిలెట్ తో పాటు తాత్కాలిక మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ కొరత లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు 125 కెవి జనరేటర్ ను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి అన్నారు. పార్కింగ్ ప్రదేశంలో డీఎస్పీ సూచించిన ప్రదేశంలో అదనపు ట్రాన్స్ఫార్మర్ బిగించి ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీస్ అధికారులు సూచించిన ప్రదేశాలలో బారికేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు రహదారుల్లో ఉన్న గుంతలను పూడ్చి రహదారులను సరిచేయాలని ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. కర్రల సమరంలో గాయపడిన భక్తులకు వెంటనే వైద్య చికిత్సలు అందించేందుకు 20 పడకల ఆసుపత్రి, నాలుగు వైద్య బృందాలు, నాలుగు అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు అవసరమైన డాక్టర్లను ఏర్పాటు చేసుకోవాలని అడిషనల్ డిఎంహెచ్ఓ ను ఆదేశించారు. దేవరగట్టు ఆలయ పది కిలోమీటర్ల పరిధిలో మద్యం షాపులు మూసివేయడంతో పాటు అక్రమ నాటుసారా స్థావరాలను గుర్తించి దాడులు నిర్వహించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.

జిల్లా ఎస్పి పకీరప్ప మాట్లాడుతూ కర్రల సమరంలో పాల్గొనే ప్రధాన వ్యక్తులను గుర్తించి బైండోవర్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఆలూరు హాలహర్వి ఆస్పరి చిప్పగిరి చుట్టుపక్కల గ్రామాలలో కర్రల సమర అనాగరిక చర్యలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.144 సెక్షన్ అమలు చేయడంతో పాటు శిధిలావస్థకు చేరుకున్న భవనాలపై భక్తులు ఎక్కకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్, చెక్పోస్టులు పటిష్టం చేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. దేవరగట్టు ఆలయ పరిధిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వీక్షిస్తామని కలెక్టర్ కు నివేదించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ ఈ జయరామిరెడ్డి, విధ్యుత్ ఎస్ ఈ భార్గవరాముడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ,
పంచాయతీ రాజ్ ఇంజనీర్లు, అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

About The Author