గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా..


గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు. దేశం బాగుండాలంటే పల్లెలు పచ్చగా ఉండాలనేది మన అందరికి తెలుసు. అయితే ఏడు దశాబ్దాలుగా మన పాలకుల్లో కొందరు మాత్రమే ఆ దిశగా అడుగులు వేశారు. వారిలో ముఖ్యమంత్రిగా తొలిసారిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ముందడుగు వేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి.. కీలకమైన ప్రభుత్వ శాఖలందరి ఉద్యోగులతో అనుసంధానం చేస్తూ కొత్త పరిపాలన విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు ఓ సువర్ణ అధ్యాయం .
జాతిపిత మాహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండు నుంచి గ్రామాలు, వార్డుల్లో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కార్యాలయంలో దాదాపు 34 విభాగాలకు సంబంధించిన ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు కేవలం 72 గంటల్లోనే సామాన్య ప్రజలకు అందడమే లక్ష్యంగా పేదల కన్నీరును తుడిచి ముఖంపై చిరునవ్వులు పూయించడమే పరమావధిగా పని చేసేందుకు ప్రణాళికలు తయారయ్యాయి. దాదాపు 500 సేవలు గ్రామ సచివాలయాల్లో పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా కొత్త సంవత్సరం 2020 జనవరి ఒకటి నుంచి రేషన్ కార్డులు, పెన్షన్లు, ఆరోగ్య శ్రీ వంటి పలు సంక్షేమ పథకాలు గ్రామ సచివాలయం పరిధిలోకి తీసుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల లబ్దిదారుల వివరాలను రాజకీయాలు, కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ఎంపిక చేసి నోటీసు బోర్డులో వివరాలుండేలా జాగ్రత్తలుండబోతున్నాయి.

About The Author