ప్రస్తుతం సైరా సినిమాపై హంగామా, యాంటీ- హంగామా జరుగుతోంది.
ఆంగ్లేయులతో పోరాడిన ఒక యుద్ధవీరుడ్ని పట్టుకుని సీమరెడ్డి అని, రాయలసీమ సింహం అని కొంతమంది ఆయన స్థాయిని తగ్గించడం దేనికి ? నరసింహారెడ్డి కాలంలో అసలు రాయలసీమ అనే పదమే చరిత్రలో, వాడుకలో లేదు. కడప, కర్నూలు, అనంతపూరు, చిత్తూరు, బళ్ళారిని కలిపి సీడెడ్ డిస్ట్రిక్ట్స్ (దత్తమండలాలు) అనేవారు. ఆంధ్రా, నైజాం, సీడెడ్ అనే వర్గీకరణతో అదే పదం సినిమా రంగంలో ఇప్పటికీ వాడుకలో ఉంది.
బ్రిటీష్ వాడి దత్తమండలాలు అంటే అవమానకరంగా ఉందని భావించిన నాటి ఆంధ్రా నేతలు 1928 నవంబర్ 18 న నంద్యాల ఆంధ్రమహాసభ మీటింగులో చిలుకూరి నారాయణరావుగారు ఈ ఐదుజిల్లాలకి “రాయలసీమ” అనే పేరుని ప్రతిపాదిస్తే, సర్వేపల్లి రాధాక్రిష్ణన్, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కడప కోటిరెడ్డి, కల్లూరి సుబ్బారావు తదితరులు బలపరచి తీర్మానం చేశారు. నిజానికి కృష్ణరాయడు ఏలిన సీమ కర్ణాటక, తమిళనాడు, నేటి గోవా దాకా విస్తరించి, వైశాల్యంలో చాలా పెద్దదిగా ఉండేది. ఈ ఐదుజిల్లాలూ ఆరవీటి వంశం పాలించిన ప్రాంతంతో ఇంచుమించుగా సరిపోతాయి.
సీమ అనే పేరుతో తెలుగునేల మీద అప్పటికి చాలా ప్రాంతాలున్నాయి. ఇప్పుడు మనం రాయలసీమ అని పిలిచేదాంట్లోనే రేనాటి సీమ ఉండేది. కడప జిల్లా కమలాపురము, ప్రొద్దుటూరు, జమ్ములమడుగు,పులివెందుల తాలూకాలు, చిత్తూరు జిల్లాలో మదనపల్లె, వాయల్పాడు తాలూకాలు కలిపితే అది రేనాటి సీమ. ఇక పలనాటి సీమ, వెలనాటి సీమ, పాకనాటి సీమ, దూపాటి సీమ, పొత్తపి సీమ, వేంగి సీమ…ఇలా ప్రాంతాల పేర్లు రాయలసీమకు వెయ్యేళ్ళ ముందునుండీ వాడుకలో ఉన్నాయి. ప్రతాపరుద్రుడి శాసనాల్లో కూడా ఈ పేర్లున్నాయి.
అసలు ఇవాళ రాయలసీమలో ఉన్న రెడ్లలో ముప్పాతికశాతం నేటివ్ రెడ్లు కాదు. అధికశాతం కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ఒక విడత, తర్వాత విజయనగర సామ్రాజ్యం క్షీణదశలో తెలంగాణా ప్రాంతంనుండి వలస వచ్చిన రెడ్లే. రాయలసీమలో నేటివ్స్ అంటే బ్రాహ్మణులు, వైశ్యులు, బలిజలు, బోయలు, కురుబలు, యాదవులు, విశ్వబ్రాహ్మణులు, ఇతర వృత్తి కులాలు. కాబట్టి రాయలసీమ అంటే అదేదో ఒక కులానికి హక్కుభుక్తంలాగా, కేవలం వారి పౌరుష, కులవైభవ చిహ్నంలా, అక్కడ బతికే ఇతరకులాలకి స్థానం, చరిత్ర, హోదా లేనట్లు ఎవరైనా డప్పు కొడితే విని నవ్వుకోండి. నవ్వి వాళ్ళకి ఈ చరిత్ర చెప్పండి.