వైఎస్సార్ వాహన మిత్ర
పశ్చిమ గోదావరి(ఏలూరు): ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం ఏటా రూ. 10 వేలు అందించే ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఏలూరులో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు పేర్ని నాని, ఆళ్ల నాని, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కలెక్టర్ ముత్యాల రాజు, ఇతర ఉన్నతాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసగించారు. ‘వైఎస్సార్ వాహన మిత్ర’ కు ఇంకా దరఖాస్తు చేసుకోని వారికి అక్టోబర్ 30 వరకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ఈ రోజు నుంచే పథకం అమలవుతుందన్నారు.
సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. ‘లక్షల మంది ప్రయాణికులను రోజు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ గొప్ప సేవ చేస్తున్న నా అన్నదమ్ముళ్లకు, నా అక్కచెల్లెమ్మళ్లందరికీ ధన్యవాదాలు. ఇదే ఏలూరులో 2018 మే 14న పాదయాత్రలో ఒక మాట ఇచ్చాను. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లందరికీ ఇక్కడి నుంచి ఇచ్చిన ఆ మాటను అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అమలు చేయగలుగుతున్నానంటే అది కేవలం దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే. మీ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ఇచ్చిన మాట కోసం..
మీ తమ్ముడిలా.. అన్నలా మీ అందరి తరుఫున ఒక్కటే చెబుతున్నా.. నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఇచ్చిన మాటకు కట్టుబడి… అందరి బ్యాంక్ అకౌంట్లలో బటన్ నొక్కిన రెండు గంటల్లోనే డబ్బులు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పడానికి గర్వపడుతున్నా. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది.
ప్రతి సంవత్సరం రూ. 10 వేల చొప్పున ఐదేళ్లలో రూ. 50 వేలు మీ అకౌంట్లలో వేస్తానని సగర్వంగా చెబుతున్నాను.
లైసెన్స్ ఉండి కుటుంబ సభ్యుల పేరుతో ఆటో ఉంటే చాలు.. ఇక తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారులు అయితే నేరుగా ఈ పథకం వర్తించేలా ఆదేశాలు ఇచ్చాం. ఆన్‌లైన్‌లో పెట్టాం. గ్రామ వలంటీర్లు ఇంటికి వచ్చి చేయి పట్టుకొని నడిపించారు. ఈ పథకం పారదర్శకంగా, ఒక్క రూపాయి కూడా ఎవరికీ లంచం ఇవ్వాల్సిన పనిలేకుండా… నేరుగా సుమారు 1.74 లక్షల కుటుంబాలకు మేలు కలిగించేది. ఇటువంటి రాష్ట్రానికి జగన్ అనే నేను ముఖ్యమంత్రిగా ఉన్నానని గర్వంగా చెబుతున్నాను.
వారందరికీ సెల్యూట్..
మీ అందరికీ ఒకే ఒక సూచన చేస్తున్నా.. పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోతే అక్టోబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా ఎవరైన అర్హులు ఉంటే వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. గ్రామ వలంటీర్లు కూడా మీకు సాయం చేస్తాం. అక్టోబర్‌లో దరఖాస్తు చేసుకుంటే నవంబర్‌లో ఇచ్చేస్తామని ఇదే వేదికపై నుంచి చెబుతున్నాను. ఇంత గొప్ప కార్యక్రమాన్ని లంచాలు, వివక్షకు తావులేకుండా చేసినందుకు గ్రామ వలంటీర్లను అభినందిస్తున్నాను. గ్రామ సచివాలయ ఉద్యోగులు ఈ పథకానికి సహకరిస్తూ తోడుగా ఉండాలని కోరుతున్నాను. అదే విధంగా పథకం అమలుకు సహకరించిన రవాణా శాఖ అధికారులు, మంత్రి పేర్ని నాని.. అందరికీ సెల్యూట్ చేస్తున్నాను’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.