ఆర్టీసీ కార్మికులకు సర్కారు హెచ్చరిక..

తెలంగాణ:ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, ఐఏఎస్‌ అధికారుల కమిటీ మధ్య గురువారం నాడు జరిగిన చర్చలు విఫలం కావడంతో అక్టోబరు 5 నుంచి ఆర్టీసీ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబరు 5న అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాల జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.దసరా ముందు బస్సులను నడపకుండా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, డిస్మిస్ చేయక తప్పదని అధికారులు హెచ్చరించారు. ఆర్టీసీ ఎండీ, కమిటీలో సభ్యుడైన సునీల్ శర్మ మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా సమ్మెకు దిగితే కార్మికులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఎస్మా కూడా ప్రయోగిస్తామని అన్నారు. అయితే.. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని కార్మిక నేతలు స్పష్టం చేశారు. కాగా, శుక్రవారం మరోసారి కార్మిక జేఏసీతో చర్చలు జరుపుతామని ప్రభుత్వ అధికారులు అన్నారు.

 

                                        

About The Author