శ్రీవారి బ్రహ్మోత్సవాల భాగంగా గరుడ వాహన సేవకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు
తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల భాగంగా గరుడ వాహన సేవకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సుమారు రెండు లక్షల మంది భక్తులు స్వామివారి గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేలా ఏర్పాట్లు చేశామన్నారు. గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులకు వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. మాడ వీధుల్లో 20 ప్రాంతాల్లో, వెలుపల 14 ప్రాంతాల్లో గరుడ సేవను భక్తులు తిలకించడానికి ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశామని అనిల్ సింఘాల్ పేర్కొన్నారు.
కట్టుదిట్టమైన భద్రత
స్వామివారి గరుడ వాహన సేవకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని టీటీడీ సీవీఎస్ఓ గోపీనాథ్ జెట్టి తెలిపారు. సుమారు 4 వేల మంది పోలీసులు, 15000 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. నిరంతరం కంట్రోల్‌రూమ్ నుంచి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తారని పేర్కొన్నారు. 1600 సీసీ కెమెరాలతో గరుడసేవ నిరంతరం పర్యవేక్షణలో ఉంటుందన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి గ్యాలరీలలోకి భక్తులను అనుమతిస్తామని గోపీనాథ్ తెలిపారు.