అసలు ఆర్టీసీ సమ్మె ఎందుకో తెలుసా…?


తెలంగాణా రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు రెండ్రోజులుగా సమ్మె చేస్తున్నారు. అసలు ఈ సమ్మె చేయడానికి కారణాలేంటో మీకు తెలుసా..? ఆర్టీసీ కండక్టర్ బేసిక్ పే 12610 ₹ డి.ఎ, హెచ్.ఆర్.ఏ మరియు ఇతర అలవెన్స్ లు మొత్తం కలిపి జీతం ఇరవైవేలు దాటదు.

డ్రైవర్ బేసిక్ పే 13500 ₹ కు డి.ఏ, హెచ్.ఆర్.ఏ మరియు ఇతర అలెవెన్స్ లు కలుపుకుంటే కండక్టర్ కంటే ఇంకొక వెయ్యి, రెండువేలు ఎక్కువ వస్తుంది.

రిటైర్మెంట్ అయ్యాక వచ్చే పెన్షన్ 5000 ₹ లకు మించదు.

ఉద్యోగం చేరి పది సంవత్సరాల అయినా కూడా ఒక్క ఇంక్రిమెంట్ రాని కార్మికులు సగం మంది ఉంటారు. పైగా ఉద్యోగ భాద్యతలు ఎప్పుడూ రిస్కే. పని వత్తిడి విపరీతంగా ఉంటుంది..

2017 లో చేయవలసిన వేతన సవరణ ఇప్పటి వరకు చేయలేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వ క్లర్క్ కు ముప్పైవేలు వస్తుంది. సర్వీసు లో దాదాపు అరవైవేలు దాటుతుంది. కానీ సగటున ఒక ఆర్టీసీ కార్మికుడు 58 సంవత్సరాల సర్వీస్ నిండి రిటైర్మెంట్ నాటికి పొందే బేసిక్ 38000 ₹ – 42000 ₹ మద్య ఉంటుంది.

టి.ఎస్.ఆర్టీసీలో పదివేల బస్సులు ఉంటే అందులో ఏటా 10% అంటే వెయ్యి బస్సులు కాలం చెల్లుతున్నాయి. కాని 2014 నుండి ఇప్పటి వరకు టీఎస్ఆర్టీసీలో కేవలం 900 బస్సులు మాత్రమే కొనుగోలు చేశారు.

2014 నుంచి ఇప్పటి వరకు ఆర్.టీ.సి ఇస్తున్న విద్యార్థి బస్సు పాసులు, వికలాంగుల బస్సు పాసులు, జర్నలిస్టుల బస్సు పాసులు మరియు ఇతర రాయితీల కింద మొత్తం 2800 కోట్ల రూపాయలు రావాల్సిందిగా క్లెయిమ్ చేస్తే,ఈ అయిదేళ్ల కాలంలో ఇచ్చింది 710 కోట్లు మాత్రమే ఇచ్చారు.

డీజిల్ పై వ్యాట్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఏడాదికి 600 కోట్ల రూపాయలు, రోడ్ టాక్స్ ద్వారా ఏడాదికి 200 కోట్ల రూపాయలు మరియు విడి భాగాల మీద విధించే వ్యాట్ ద్వారా ఏడాదికి 100 కోట్ల రూపాయలు ఆర్టీసీ నుంచి వసూలు చేస్తున్నారు.

2014 డీజిల్ ధర 48 రూపాయలున్నప్పుడు ఉన్న టిక్కెట్ ధర, ఈరోజు 76 రూపాయలు ఉన్నప్పుడు కూడా అంతే ఉంది. పెరిగిన డీజిల్ ధరలను ఏటా 500 కోట్ల రూపాయల భారాన్ని ఆర్టీసీయే భరించి అప్పుల పాలవుతుంది.

డబుల్ డూటికి డబుల్ వేతనం ఇవ్వాలని చట్టం చెప్తున్నా కనీసం సింగిల్ వేతనం కూడా ఇవ్వకుండా డ్రైవర్ కు 525 ₹ మరియు కండక్టర్ కు 460 ₹ ఇచ్చి శ్రమ దోపిడి చేస్తున్నారు.

RTC లో పిఎఫ్ చెల్లింపులు చెయ్యక ఆరునెలలు దాటింది.. సి.సి.ఎస్.ఋణాలు చెల్లించక ఎనిమిది నెలలు అయ్యింది. ప్రస్తుతం ఈ నెల జీతం కూడా చెల్లించలేదు.

RTC ని ప్రభుత్వంలో కలపాలనే డిమాండ్

వంద శాతం కరెక్ట్..

సమ్మె చేస్తే డిస్మిస్ చేస్తారట..

తెలంగాణ కొరకు చేస్తే తప్పుకాదు..

జీతాలకోసం, జీవితాలకోసం చేస్తే తప్పట..

సకల జనుల సమ్మె కాలానికి ఇస్తానన్న బకాయిలు ఇప్పటి వరకు రాలేదు..

ఆర్టీసీ కార్మికుల కు ఎస్మా చట్టాలు కొత్తకాదు, డిస్మిస్ బెదిరింపులు కొత్తకాదు. తమ న్యాయమైన కోరీకల సాధనకు సమ్మెకు పోవలసివచ్చింది.. అది వారికున్న ప్రజాస్వామ్య హక్కు..

About The Author