నిమిషాల్లో 40 లావాదేవీలు! లబోదిబోమంటూ బాధితుడి ఫిర్యాదు

చిత్తూరు జిల్లా పలమనేరు : నాలుగును నొక్కండని ఓ నంబరు నుంచి వచ్చిన వాయిస్‌ రికార్డింగ్‌ విని ఆ సంఖ్యను నొక్కగానే  ఓ వ్యక్తి ఖాతాలో రూ.15వేలు మాయమైన ఘటన పలమనేరులో శనివారం చోటు చేసుకుంది. వివరాలు..స్థానిక గుడియాత్తం రోడ్డులో ఆదెప్ప అనే వ్యక్తి మీ–సేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. బ్యాంకులో మీకు ఏదైనా సమస్యలుంటే తెలుసుకోవచ్చునని శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు అతని మొబైల్‌కు 02264427800 అనే నంబరు నుంచి  వాయిస్‌ రికార్డింగ్‌ వచ్చింది. తెలుగులో సమాచారం వినేందుకు 4 నొక్కాలని చెప్పడంతో అతను అలాగే చేశాడు. ఇంతలో కాల్‌ కట్‌ అయి నిమిషాల వ్యవధిలో అతని ఖాతా నుంచి రూ.1000, రూ.200, రూ.6000, రూ. 150 ఇలా డబ్బులు డ్రా అవుతున్నట్టు ఎస్‌ఎంఎస్‌లు వచ్చాయి. దీంతో బాధితుడు బ్యాంకుకు పరుగులు తీసి తన ఖాతాను బ్లాక్‌ చేయించాడు. ఆలోపే 40 లావాదేవీలు జరిగి అతని ఖాతాలోని రూ. 15వేలు డ్రా అయ్యాయి. ఇదంతా సైబర్‌ నేరగాళ్ల పనంటూ బ్యాంకు అధికారులు తేల్చిచెప్పడంతో బాధితుడు గొల్లుమన్నాడు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

About The Author