సమ్మెకు ప్రభుత్వమే కారణం.. కార్మిక జేఏసీ నిప్పులు.

హైదరాబాద్‌ : ఆర్టీసీపై ప్రభుత్వం కుట్రం చేస్తోందని మండిపడ్డారు కార్మిక సంఘాల జేఏసీ ప్రెసిడెంట్ అశ్వత్థామ రెడ్డి. టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని సంఘాల మద్దతు ఉందని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వమే అన్ని విధాలుగా కారణమన్నారు. ఉద్దేశపూర్వకంగానే టీఆర్ఎస్ సర్కార్ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లేలా చేసిందని ధ్వజమెత్తారు. ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టే కుతంత్రం జరుగుతోందని.. అందులో భాగంగానే ఆర్టీసీని మూసివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆదివారం నాడు హైదరాబాద్‌లోని ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన ట్రేడ్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన అశ్వత్థామ రెడ్డి పలు అంశాలు ప్రస్తావించారు.

బెట్టు వీడని కార్మికులు.. మెట్టు దిగని ప్రభుత్వం.

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు బెట్టు వీడలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మెట్టు దిగలేదు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె అనివార్యమైంది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కార్మికులు సమ్మెకు దిగారు. అన్నీ సంఘాల మద్దతుతో సమ్మె కొనసాగుతోంది. ఆ మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు అశ్వత్థామ రెడ్డి ప్రభుత్వానికి చురకలు అంటించారు. ఈ సమ్మెకు ప్రధాన కారణం ప్రభుత్వమేనంటూ ఫైరయ్యారు.

ట్రేడ్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన అశ్వత్థామ రెడ్డి.. ఆర్టీసీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు విస్తృత సేవలు అందిస్తున్న ఆర్టీసీని కాపాడాల్సింది పోయి మూసివేయాలనే ధోరణి సరికాదని హెచ్చరించారు. ప్రభుత్వ చర్యల కారణంగానే సమ్మె అనివార్యమైందని మండిపడ్డారు.

జీతాల కో కాదు.. సంస్థ మనుగడ కోసం పోరాటం.

జీతాల కోసమో, మా జీవితాల కోసమో ఈ పోరాటం కాదన్నారు అశ్వత్థామ రెడ్డి. నిర్వీర్యం అవుతున్న రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నం కాకుండా చూడటమే తమ ధ్యేయమని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. యూనియన్లకో లేదంటే వ్యక్తులకో భయపడి కార్మికులు సమ్మెకు దిగలేదని.. స్వచ్ఛందంగా పోరాటంలో భాగమవుతున్నారని చెప్పుకొచ్చారు.

ఉద్యోగ సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా సమ్మెకు మద్దతు ప్రకటించినట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాల కారణంగానే ఆర్టీసీ సమ్మె తప్పలేదన్నారు. ఆర్టీసీకి ఉన్న మంచి పేరును పొగొట్టడమే కేసీఆర్ కుట్రగా అభివర్ణించారు. పండుగ నేపథ్యంలో కార్మికులను రెచ్చగొట్టి సమ్మెకు వెళ్లేలా చేశారని ధ్వజమెత్తారు. ఇంతటి దుర్భర పరిస్థితి ఆర్టీసీ చరిత్రలో ఏనాడు లేదన్నారు.

సోమవారం ధర్నా.. అందరి మద్దతు కావాలి..

ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం (07.10.2019) నాడు ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన ధర్నాకు ప్రతి ఒక్కరూ సపోర్టు ఇవ్వాలని కోరారు అశ్వత్థామ రెడ్డి. మంత్రుల కమిటీ వేసినా చర్చలు సఫలం కాకపోవడానికి కారణమెవరని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఏనాడూ కూడా సీఎం కేసీఆర్ దగ్గర పరిష్కారమైన దాఖలాలు లేవన్నారు.

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి.. డ్యూటీలో చేరకుంటే ఉద్యోగాలు పీకేస్తా అంటూ మాట్లాడిన తీరును తీవ్రంగా తప్పు పట్టారు. మీ పదవికే గ్యారంటీ లేదని.. మీ ముఖ్యమంత్రి మీ కుర్చీ ఎప్పుడు లాగేస్తారో తెలియని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. ఒకనాడు కేసీఆర్ తీరును తప్పు పట్టిన పువ్వాడ అజయ్ ఇవాళ మంత్రి పదవి రాగానే మారిపోయారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత టీఆర్ఎస్ సర్కార్‌దేనని డిమాండ్ చేశారు. కాని పక్షంలో ఇప్పుడు ఆరంభం మాత్రమేనని.. ఇంకా మున్ముందు తమ పోరాటమేందో చూస్తారని హెచ్చరించారు.

 

                                        

About The Author