ఐటితో వేగంగా, పారద‌ర్శ‌కంగా సేవ‌లు

తిరుమల:ప్రపంచప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం సనాతన ధర్మ ప్రచారానికి విశేష కృషి చేస్తోంది. శ్రీవారిని కీర్తించిన ఆళ్వార్లు, భగవద్‌ రామానుజులు, శ్రీ తాళ్లపాక అన్నమయ్య, శ్రీపురందరదాస, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తదితరుల రచనలు, ఉపన్యాసాల ద్వారా భక్తలోకంలో ధార్మిక చైతన్యం కలిగిస్తోంది. శ్రీవారి భక్తులకు దర్శనం, ఆర్జితసేవలు, బస, లడ్డూ ప్రసాదం తదితర సౌకర్యాలు కల్పించడంలో గత కొన్నేళ్లుగా టిటిడి విశేష కృషి చేస్తోంది. ప్రస్తుతం దీనికి ఐటి పరిజ్ఞానం తోడవడంతో భక్తులకు మరింత పారదర్శకంగా, వేగంగా సేవలు అందించగలుగుతున్నారు. అంతర్జాలంలో ఒకే ఒక క్లిక్‌తో భక్తులు తమకు కావాల్సిన సౌకర్యాన్ని, సమాచారాన్ని తెలుసుకోగలుగుతున్నారు.

టిటిడిలో స్మార్ట్‌ పాలన..

దేశం నలుమూలల నుంచి విచ్చేస్తున్న భక్తులు మరింత సులువుగా వసతులు పొందేందుకు వీలుగా టిటిడి సాంకేతికతను స‌మ‌కూర్చుకుంది. భక్తుల సౌకర్యాలను క్రమబద్ధంగా నిర్వహించడంతో పాటు పాలనా వ్యవస్థలోనూ ఐటి పరిజ్ఞానానికి పెద్దపీట వేశారు. దర్శనం, బస, లడ్డూ ప్రసాద వితరణ, దాతల ప్రయోజనాలు, కల్యాణవేదికలో వివాహాలు, శ్రీవారి సేవ తదితర సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. ఈ సేవలన్నింటికీ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లు రూపొందించారు. ఐటి అప్లికేష‌న్ల ద్వారా మరింత నాణ్యంగా భక్తులకు సేవలందించడంతోపాటు ధార్మిక, సామాజిక, సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు.

గోవింద మొబైల్‌ యాప్‌

టిటిడి ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందిస్తున్న సేవలన్నింటినీ గోవింద మొబైల్‌ యాప్‌లోనూ అందిస్తోంది. ఇందులో రూ.300/- దర్శన టికెట్లు, ఆర్జితసేవలు, హుండీ, డొనేషన్స్‌, క‌ల్యాణ‌వేదిక‌, స‌ప్త‌గిరి మాస‌ప‌త్రిక లాంటి సేవలను ప్రయాణాల్లో ఉన్నా మొబైల్‌ ద్వారా బుక్‌ చేసుకునే సౌక‌ర్యం క‌ల్పించింది.

ప‌లు ఐటి సేవ‌లు :

ప్రతినెలా మొదటి శుక్రవారం భక్తులు బుక్‌ చేసుకునేందుకు ఇంటర్నెట్‌లో శ్రీవారి ఆర్జితసేవా టికెట్లను విడుదల చేస్తున్నారు.

తిరుమలలోని సిఆర్‌వో వద్ద లక్కీడిప్‌ ద్వారా భక్తులకు ఆర్జితసేవా టికెట్లను మంజూరు చేస్తున్నారు.

రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లు, బస, ఈ-హుండీ, ఈ-పబ్లికేషన్స్‌, ఈ-డొనేష‌న్స్‌, డోనార్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ తదితర సేవలు.

తిరుమల, తిరుప‌తిలోని కౌంట‌ర్ల ద్వారా స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ.

అలిపిరి, శ్రీ‌వారి మెట్టు మార్గాల్లో దివ్య‌ద‌ర్శ‌నం టోకెన్ల జారీ.

మరింత ఎక్కువ మందిని ధర్మప్రచార కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు, భ‌జ‌న మండ‌ళ్ల న‌మోదుకు హెచ్‌డిపిపి వెబ్‌సైట్ (hdpp.tirumala.org).

దేశ వ్యాప్తంగా  వివిధ రాష్ట్రాలలో గల 259 టిటిడి క‌ల్యాణ మండ‌పాల‌ను ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకునే సదుపాయం.

 శ్రీ వారి  సేవను మరింత పటిష్టం చేసి యువత, ఉద్యోగుల భాగస్వామ్యాన్నిపెంచేందుకు 3 రోజులు, 4 రోజులు, 7 రోజుల సేవకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం.

శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించేందుకు పరకామణి సేవ.

తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో భక్తులకు లడ్డూప్రసాదం అందించేందుకు లడ్డూప్రసాద సేవ.

తిరుమ‌ల‌లో దుకాణ‌దారులు ఆన్‌లైన్‌లో అద్దె చెల్లించేందుకు వీలుగా లీజ్ అండ్ రెంట‌ల్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్.

టిటిడిలో పాల‌న మ‌రింత వేగంగా, పార‌ద‌ర్శ‌కంగా జ‌రిగేందుకు ఈ-ఆఫీస్ అమ‌లు.

భక్తుల సౌక‌ర్యార్థం తిరుమ‌ల‌లో వ‌స‌తి, ద‌ర్శ‌న టికెట్ల కేటాయింపు కౌంట‌ర్ల వ‌ద్ద స్వైపింగ్ యంత్రాల‌ను ఏర్పాటుచేసి ఎలాంటి అద‌న‌పు చార్జీలు వ‌సూలు చేయ‌కుండా న‌గ‌దు ర‌హిత లావాదేవీలకు ప్రోత్సాహం.

బ్ర‌హ్మోత్స‌వాల్లో ఐటి సేవ‌లు :

 బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసిన ల‌క్ష‌లాది భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం, వ‌స‌తి, ల‌డ్డూ ప్ర‌సాదాలు త‌దిత‌ర సేవ‌లందించేందుకు ఐటి విభాగం ముంద‌స్తు ఏర్పాట్లు చేప‌ట్టింది.

బ్ర‌హ్మోత్స‌వాల విధుల నిర్వ‌హ‌ణ‌కు వ‌చ్చిన పోలీసు సిబ్బందికి డ్యూటీ పాసులు జారీ.

మీడియా సెంట‌ర్‌లో కంప్యూట‌ర్లు, ఇంట‌ర్నెట్ వ‌స‌తి, మీడియా పాసుల జారీ.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఐటి విభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి ఆధ్వ‌ర్యంలో ఐటి బృందం ఈ సేవ‌ల‌ను భ‌క్తుల‌కు అందిస్తున్నారు.

 

About The Author