కొత్త బజాజ్ చేతక్‌ను చూశారా..! జనవరి నుంచి మార్కెట్లోకి
ఒకప్పుడు భారత ద్విచక్ర వాహన మార్కెట్‌ను ఏలిన బజాజ్ చేతక్ స్కూటర్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమైంది. సరికొత్త రూపంలో ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు బజాజ్ ఏర్పాట్లు చేసింది. ఈ సారి ఎలక్ట్రిక్ వాహనంగా ఇది వినియోగదారులను పలకరించనుంది. ఈ స్కూటర్ విశేషాలను బుధవారం బజాజ్ వెల్లడించింది. దీనిని బజాజ్ చకన్ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. జనవరి 2020 నుంచి మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. తొలుత పుణే, తర్వాత బెంగళూరులో విక్రయాలు ప్రారంభించి దేశవ్యాప్తంగా విస్తరించాలని బజాజ్ ప్రణాళిక సిద్ధం చేసింది.
బజాజ్‌కు చెందిన ది అర్బనైట్ బ్రాండ్ కింద వస్తున్న తొలి వాహనం ఇదే కావడం విశేషం. దీని ధరకు సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించలేదు. కానీ, సుమారు రూ.1.5లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ప్రస్తుతానికి ఇది బజాజ్ ప్రీబుకింగ్ నెట్‌వర్క్ కింద ఉంటుంది. ప్రస్తుతం కేటీఎం వంటి వాహనాలు ఇలానే బుక్ చేసుకొంటున్నారు. ఆ తర్వాత ఈ వాహనానికి వచ్చిన స్పందన ఆధారంగా బుకింగ్‌నెట్‌వర్క్‌ను విస్తరిస్తారు.
కొత్త వాహనంలో ఐపీ 67 రేటింగ్ ఉన్న హైటెక్ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. దీనిని 5-15 ఏఎంపీస్ ఎలక్ట్రికల్ అవుట్‌లెట్‌లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలను బజాజ్ వెల్లడించాల్సి ఉంది. దీనిలో ఇంటెలిజెట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ వ్యవస్థను అమర్చారు. ఇది బ్యాటరీని నియంత్రిస్తుంది. దీనిలో ఎకో, స్పోర్ట్స్ అనే రెండు డ్రైవింగ్ మోడ్‌లు ఉండే అవకాశం ఉంది. స్కూటర్‌లో రీజనరేటీవ్ బ్రేకింగ్ వ్యవస్థను అమర్చారు. ఇది బ్రేకింగ్‌కు కారణంగా వచ్చే వేడిని గతిశక్తిగా మార్చి స్కూటర్ రేంజిని పెంచుతుంది.
సరికొత్త చేతక్ చూపులకు
పూర్తి రెట్రో స్టైల్‌లో తయారు చేశారు. ఈ వాహనంలో చేతక్ బ్యాడ్జి ఉంటుంది. ఆప్రాన్ నుంచి టెయిల్ లైట్ వరకు మంచి ఫినిషింగ్‌తో దీనిని తయారు చేశారు. దీనికి ఎల్‌ఈడీ డే టైమ్ ల్యాంప్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్ ఉన్నాయి. దీనిలోని ఫెదర్ టచ్ యాక్టివేటెడ్ ఎలక్ట్రానిక్ స్విచ్‌లు వాహనం ఆకర్షణను మరింత పెంచనున్నాయి. మల్టీస్పోక్ అలాయ్ వీల్స్ దీనికి అందించనుంది. మొత్తం ఆరు రంగుల్లో చేతక్ మార్కెట్లోకి రానుంది. భారత మార్కెట్లో దీనిని విడుదల చేశాక యూరప్ మార్కెట్లకు పరిచయం చేయాలని బజాజ్ ప్లాన్ చేస్తోంది.