సేలం ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో మద్యంతో విద్యార్థిని పుట్టిన రోజు వేడుకలు

తమిళనాడు ,తిరువొత్తియూరు: సేలం ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో మద్యంతో విద్యార్థిని పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఇది చూసిన ఉపాధ్యాయుడు వారిని మందలించాడు. దీంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. సేలం ఇడైపట్టి విద్యాజోన్‌కు చెందిన ఓ ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలలో 1,500 మంది విద్యార్థినులు చదువుతున్నారు. మంగళవారం ఉదయం అబ్దుల్‌ కలాం జయంతిని జరుపుకున్నారు. అనంతరం ప్లస్‌టు చదువుతున్న ఓ విద్యార్థిని మంగళవారం పుట్టిన రోజు కావడంతో ఐదుగురు విద్యార్థినులు తరగతి గదిలో కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఆ సమయంలో ఆ విద్యార్థినుల్లో ఓ విద్యార్థిని చేతిలో ఉన్న సంచిలో బీరు లాంటి మద్యం బాటిల్స్‌ ఉన్నాయి.

దీన్ని సెల్‌ఫోన్‌లో వీడియోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో తరగతిలోకి వచ్చిన ఓ ఉపాధ్యాయిని మద్యం బాటిల్స్‌తో ఉన్న విద్యార్థినులను చూసి ఆగ్రహించింది. తరువాత వారి తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి వారి సమక్షంలో విద్యార్థినులను మందలించారు. ఈ క్రమంలో తల్లిదండ్రులుతో కలిసి ఇంటికి వెళ్లిన విద్యార్థిని ఒకరు హఠాత్తుగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది చూసిన తల్లిదండ్రులు, పోలీసులకు, బంధువులకు తెలియజేయకనే విద్యార్థిని మృతదేహాన్ని దహనం చేశారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. దీనిపై జిల్లా ముఖ్య విద్యాధికారి విచారణ చేస్తున్నారు.

 

 

About The Author