అద్దాలు తెరుచుకోకపోవడంతో గాల్లో కలిసిన ఆరు ప్రాణాలు
సూర్యాపేట: సాగర్ కాల్వ నుంచి వెలికితీసిన కారులో ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. శుక్రవారం నాడు మిత్రుడి విహహానికి హాజరై తిరిగి వస్తుండగా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చాకిరాల వద్ద కారు అదుపుతప్పి ఎన్ఎస్పీ కాల్వలోకి దూసుకెళ్లింది. కారులోని ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు అద్దాలు తెరుచుకోకపోవడంతో యువకులు బయటికి రాలేకపోయినట్లు తెలిసింది. ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. 18 గంటల శ్రమ అనంతరం క్రేన్ సాయంతో కాల్వలో పడ్డ కారును బయటకు తీశారు.
గల్లంతైన ఆరుగురు మృతి చెందారు. వీరి మృతదేహాలు కారులోనే లభ్యమయ్యాయి.
చాకిరాలలో శుక్రవారం జరిగిన వివాహానికి వరుడి మిత్రులు 11 మంది హైదరాబాద్ నుంచి రెండు కార్లలో వచ్చారు. ఊరేగింపు అనంతరం రాత్రి 7.30 గంటలకు బయల్దేరారు. ఈ క్రమంలో ముందువెళ్తున్న స్కార్పియో వాహనం మలుపు వద్ద కాల్వలోకి దూసుకెళ్లింది. వెనుక మరో వాహనంలో వస్తున్న మిత్రులు గమనించి కేకలు వేస్తూ ఫోన్లలో సమాచారం ఇవ్వడంతో 108 వాహనంతో పాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్వలో గల్లంతైన వారంతా సికింద్రాబాద్ ఏఎస్‌రావునగర్‌లోని సైనిక్‌పురి అంకుర హాస్పిటల్ సిబ్బందిగా సమాచారం. మృతులను అబ్దుల్ అజీజ్(వైజాగ్), జిన్సన్(కేరళ), రాజేశ్, సంతోష్(హైదరాబాద్), పవన్, నగేష్(మల్కాజిగిరి)గా గుర్తించారు.