శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేల విరాళం ఇచ్చిన ప్రతి భక్తుడూ విఐపి బ్రేక్ దర్శనం టికెట్టు పొందడానికి అర్హులుగా ప్రకటించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి) ట్రస్టుకు రూ.10 వేల విరాళం ఇచ్చిన ప్రతి భక్తుడూ విఐపి బ్రేక్ దర్శనం టికెట్టు పొందడానికి అర్హులుగా ప్రకటించింది. ఎటువంటి సిఫార్సు లేకున్నా….రూ.10 వేలు చెల్లిస్తే ఆటోమేటిక్‌గా రూ.500 ప్రత్యేక టికెట్టు దర్శనం సంపాదించుకోవచ్చు. అంటే విరాళంగా రూ.10 వేలు ఇచ్చిన వారు బ్రేక్ దర్శనం కౌంటర్‌కు వెళ్లి రూ.500 చెల్లించి బ్రేక్ దర్శనం టికెట్టు తీసుకోవచ్చు. ఇది సోమవారం రాత్రి నుంచే అమల్లోకి వచ్చినట్లు అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ప్రధానమైన సంశయం తలెత్తుతోంది. ఇక విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి అధికారుల విచక్షణ కోటా ఉంటుందా ఉండదా అనేదే అ సంశయం. ఇప్పటిదాకా విఐపి బ్రేక్ దర్శనం టికెట్టు ధర రూ.500గా ఉంది. ఈ టికెట్లుకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. అందుకే విఐపిలకు, విఐపిల సిఫార్సు లేఖలు తెచ్చిన వారికి మాత్రమే బ్రేక్ దర్శనం టికెట్లు కేటాయిస్తూ వస్తున్నారు. అయితే…ఇప్పుడు రూ.10 వేల విరాళం ఇచ్చిన ప్రతి ఒక్కరూ బ్రేక్ దర్శనానికి అర్హులని ప్రకటించిన పరిస్థితుల్లో….బ్రేక్ దర్శనం టికెట్టు ధర రూ.10,500 అయినట్లయింది.