ఈ కానిస్టేబుళ్లకు కోటి దండాలు..


ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లలో పరిమళించిన మానవత్వం, మతి స్థిమితం లేని ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ ని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన వైనం. ప్రకాశం జిల్లా ఉలవపాడు, గుడ్లూరు మధ్య రోడ్ సేఫ్టీ విధులు చూస్తున్న కానిస్టేబుళ్లు ప్రసాద్, బ్రహ్మయ్యలు.. జాతీయ రహదారిపై బీట్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు వర్షంలో తడుస్తూ కనిపించాడు. మళ్లీ తిరిగి వస్తుండగా ఆ యువకుడు వర్షంలోనే తడుస్తూ నడుచుకుంటూ పోతుండటంతో వాహనం ఆపి ఆ యువకుడిని విచారించి మతి స్థిమితం లేని వాడని తెలుసుకున్నారు. తమతో తీసుకెళ్లి, ఉలవపాడు హోటల్ లో టిఫిన్ పెట్టించారు. ఆ తర్వాత మధ్యాహ్నం, రాత్రి కూడా వారే భోజనం పెట్టారు. అతని వద్ద ఉన్న ఆధార్ కార్డ్ ఫొటోలు తీసి తెలిసిన వారికి సమాచారమిచ్చారు. కుటుంబ సభ్యులు గుర్తించి మంగళవారం ఉదయం ఉలవపాడు వచ్చి తమ బిడ్డను తీసుకెళ్లారు. పుల్లల చెరువు మండలం రాచకొండకు చెందిన ఈ యువకుడు పేరు రాజేష్. విజయవాడలో ఆర్కే ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలో జరిగిన గొడవల్లో తలకి తగిలిన గాయంతో మతి స్థిమితం కోల్పోయాడు. తల్లిదండ్రులు పలుచోట్ల వైద్యం చేయించినా ఆరోగ్యం కుదుటపడలేదు. 6నెలల క్రితం ఒంగోలు రిమ్స్ లో వైద్యంకోసం చేర్చారు. తల్లి నిద్రపోతున్న సమయంలో ఆస్పత్రి నుంచి వచ్చేసి, మతి స్థిమితం లేకపోవడం వల్ల మళ్లీ దారి తెలియక గత 6నెలలుగా ఇలా తిరుగుతున్నాడు. తల్లిదండ్రులు అప్పటినుంచి తమ బిడ్డకోసం వెదుకుతున్నారు. చివరకు కానిస్టేబుల్ మానవత్వం వారికి వరమైంది. మతి స్థిమితం లేని బిడ్డను తల్లిదండ్రుల చెంతకు చేర్చింది

About The Author