నువ్వులేని జీవితం నాకొద్దు… పాపతోసహా నీదగ్గరకే వచ్చేస్తున్నా …
అన్యోన్యంగా సాగుతున్న వారి కుటుంబాన్ని డెంగీ జ్వరం ఛిన్నాభిన్నం చేసింది. ఆ జ్వరంతో భార్య లోకాన్ని విడిచి వెళ్లిపోవడాన్ని తట్టుకోలేకపోయిన భర్త తన ముద్దుల కుమార్తెను కడతేర్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం తూర్పుగోదావరి జిల్లా మండపేటలో విషాదం నింపింది. బాదం చందనకుమార్ (చందు)కు 2015లో కంచర్ల శ్రీనవ్యతో వివాహమైంది. ఫ్లెక్సీ ప్రింటింగ్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న వీరికి శ్రీయోషిత అనే మూడేళ్ల కుమార్తె ఉంది. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి కుటుంబాన్ని డెంగీ జ్వరం అతలాకుతలం చేసింది.
తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఈ నెల 5న శ్రీనవ్య ఆస్పత్రిలో కన్నుమూసింది. భార్య మరణంతో చందు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఆమె ఆశయం మేరకు ఆమె కళ్లను దానం చేశాడు. నాటి నుంచి తీవ్ర మానసిక వేదనకు గురవుతున్న చందు భార్య లేనిదే జీవితం లేదని భావించాడు. మరో వివాహం చేసుకున్నా తన కుమార్తెకు తల్లి ప్రేమ దక్కదని భావించాడు. ‘నా భార్య వద్దకే మేమిద్దరం వెళ్లిపోతున్నాం’ అంటూ లేఖ రాసి తన కుమార్తెను కడతేర్చి, తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చందు, శ్రీయోషితల మృతితో వారి కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.