డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఇకపై మరింత సులభం.. ఎలాగంటే?
రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం మరో కొత్త పంథాకు శ్రీకారం చుట్టనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను చాలా పకడ్బందీగా నిర్వహించనుంది. ఇందుకోసం సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఆటోమేషన్ విధానంలో జరిగే ఈ టెస్ట్‌లో ఉతీర్ణత సాధిస్తేనే లైసెన్సు దక్కుతుంది. అంతేకాకుండా ఈ టెస్ట్ మొత్తం వీడియో రికార్డు ప్రక్రియ ద్వారానే జరుగుతుంది.
ఇప్పటికే ఆటోమేషన్ విధానంలో లైసెన్సుల జారీ ప్రక్రియ గుజరాత్, మహారాష్ట్ర, కేరళ సిటీలతో పాటు హైదరాబాద్‌లో కూడా అమలవుతోంది. అక్కడ ‘సాఫ్ట్’ ట్రాక్‌ల పేరుతో ఈ విధానం అమల్లో ఉండగా.. ఇప్పుడు ఏపీలో కూడా వచ్చే ఏడాది నుంచి ఈ విధానం అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా అధునాతన సైంటిఫిక్ టెస్ట్ ట్రాక్‌ల నిర్మాణం కోసం ఇప్పటికే రవాణా శాఖ టెండర్లను ఖరారు చేసినట్లు సమాచారం. ఒక్కో ట్రాక్ ఖర్చూ.. కోటి రూపాయలు కాగా.. కేంద్రం నుంచి రూ.9 కోట్లు సాయం అందనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్లు వెచ్చించనుంది. ఇకపోతే ఈ ట్రాక్‌లు విశాఖపట్టణం, విజయవాడ, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూల్, అనంతపురం నగరాల్లో ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుతం లైసెన్సు జారీ విధానం ఇలా…
వాహనం ఏదైనా ప్రస్తుతం లైసెన్సు పొందాలంటే డ్రైవింగ్ ట్రాక్‌లలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో వాహనం నడపాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ డ్రైవింగ్ టెస్ట్ పాస్ కాకున్నా.. మధ్యవర్తుల సాయంతో అక్రమంగా లైసెన్సులు జారీ అవుతూనే ఉన్నాయి.
ఆటోమేషన్ విధానంలో లైసెన్సు జారీ ఇలా..
అధునాతనంగా ఏర్పాటు చేసే ఈ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో సెన్సర్లు, కెమెరాలు అమర్చబడి ఉంటాయి. అధికారులు మొత్తం డ్రైవింగ్ పరీక్షను రికార్డు చేస్తారు. అక్రమాలకు, సిఫార్సులకు తావు లేకుండా.. దరఖాస్తుదారులు ఆరోపించడాన్ని వీలులేకుండా.. నిర్దేశిత నిబంధనల ప్రకారం డ్రైవింగ్ చేసిన వారికే లైసెన్సులు జారీ చేస్తారు. అంతేకాకుండా దరఖాస్తుదారుడు కోరితే రికార్డయిన ఫుటేజ్‌ను కూడా ఇస్తారు.