ఏపీ సర్కారుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందన
ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ విలీనంపై ఓ ప్రయోగం చేశారని, ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఆయన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి *పేర్ని నాని* స్పందించారు.
విజయవాడ ఆర్టీసీ ఆసుపత్రిలో టీడీపీ ఎంపీ కేశినేని నాని నిర్మించిన వసతి భవనాన్ని పేర్ని నాని ప్రారంభించి మాట్లాడుతూ … తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై స్పందించారు.
తెలంగాణ ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నామని, దేశంలో చాలా వ్యవస్థలు ప్రైవేటు పరం అవుతున్న పరిస్థితుల్లో ఏపీలో మాత్రం *ఒక కార్పొరేషన్ ను సర్కారులో విలీనం చేయడమనేది గొప్ప విషయమని పేర్ని నాని* అన్నారు.
తెలంగాణలో జరుగుతోన్న ఆర్టీసీ సమ్మెపై ఇటీవల కేసీఆర్ మాట్లాడుతూ ఏపీలో ఏం జరుగుతుందో ఆరు నెలల్లో చూద్దామని అన్నారని, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వంలో కసి పెరిగిందని తెలిపారు.
జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తామని ప్రకటన చేశామని, దాన్ని అమలు చేసి తీరాలన్న పట్టుదల పెరిగిందని పేర్ని నాని అన్నారు.