రైలులో సిలిండర్ పేలి 65 మంది మృతి…


ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో గురువారం ఉదయం జరిగిన రైలు అగ్ని ప్రమాదంలో 65మంది సజీవ దహనమయ్యారు. ‍మరో 30మంది గాయపడ్డారు. వివరాలు.. కరాచీ నుంచి రావల్పిండికి వెళ్తున్న తేజ్‌గామ్‌ రైలు లియాకత్‌పూర్‌ నగర సమీపానికి రాగానే అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగడంతో మూడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తీసుకురాగా, ఆర్మీ సిబ్బంది సైతం సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదంలో గాయడిన క్షతగాత్రులను, మృతదేహాలను అధికారులు సమీప జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

ప్రయాణికులలో కొందరు అల్పాహారం కోసం గుడ్లు ఉడకపెట్టడానికి గ్యాస్‌ వెలిగించడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉదయం టిఫిన్‌ తయారీ కోసం ఏర్పాట్లు చేస్తున్న సమయంలో రెండు స్టవ్‌లు పెద్ద శబ్ధంతో పేలిపోయాయి. వంట కోసం సిద్ధంగా వుంచుకున్న నూనెకు మంటలు అంటుకోవడంతో పరిస్థితి బీభత్సంగా మారిపోయింది. క్షణాల్లో మంటలు…మూడు బోగీలను చుట్టుముట్టాయి. దాంతో భయపడిన ప్రయాణీకులు…వేగంగా వెళ్తున్న ట్రైన్‌ నుంచి బయటికి దూకేశారు. చనిపోయిన వారిలో అలా బయటికి దూకేసిన వారే ఎక్కువగా వున్నట్లు అధికారులు చెప్తున్నారు.

ఈ ఘటనలో కనీసం 50 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్‌ రైళ్లలో ప్రయాణీకులు వంట చేసుకోవడానికి అనుమతి వుంటుంది. అదే ఇప్పుడు ప్రయాణీకులకు శాపమైంది. వంట చేస్తున్న క్రమంలో మంటలు అంటుకుని పలువురి ప్రాణాలను తీసింది. కాగా 2005లో రెండు రైళ్లు ఎదురెదురు ఢీకొనడంతో 130 మందికి పైగా ప్రయాణీకులు చనిపోయారు.

కాగా ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మృతుల ​కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రమాదంలో కాలిపోయిన బోగీలను వేరు చేసి షెడ్యూల్‌ ప్రకారం రైలును నడిపిస్తామని రైల్వే శాఖ సీఈఓ ఐజాజ్‌ అహ్మద్‌ తెలిపారు.

About The Author