భారత వాయుసేనకు చెందిన వారియర్స్ స్క్వాడ్రన్ స్వర్ణోత్సవాలు…


భారత వాయుసేన (ఐఏఎఫ్ )కు చెందిన వారియర్స్ స్క్వాడ్రన్ (26వ) ఇటీవలే స్వర్ణోత్సవాలు జరుపుకొంది. ఒక్కో స్క్వాడ్రన్ లో సగటున 18 విమానాలు ఉంటాయి. అత్యంత ప్రతిభావంతులున్న ఈ స్క్వాడ్రన్ మిగ్ -21 విమానాలతోనే భారత్ 1971 నాటి యుద్ధంలో పాకిస్థాన్ కు బుద్ధిచెప్పింది. ఈ గర్వించే సందర్భం వెనక అందోళనకర అంశం సైతం ఉంది. ఒకప్పుడు ఐఏఎఫ్ కు తలమానికంగా ఉన్న మిగ్ -21లు ఇప్పుడు భారంగా మారాయి. వచ్చే ఏడాది వీటిని పక్కనపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అమ్ములపొదిలో మిగ్ -21, మిగ్ -27, జాగ్వార్ రకాలకు చెందిన పురాతన లోహ విహంగాలు ఉన్నాయి. ఫలితంగా ప్రమాదాల రేటు పెరిగింది. వీటిలో వెళ్లిన పైలెట్లు తిరిగి వచ్చేవరకు నమ్మకంలేదన్నట్లు పరిస్థితి తయారైంది. మిగ్ -21లను తయారు చేసిన సోవియెట్ యూనియన్ తన విచ్ఛిన్నానికి ముందే 1985లో వాటిని పక్కనపడేసింది. ఇటీవల పురాతన విమానాల ప్రదర్శనకు మిగ్ -21లు అవసరం కాగా రష్యా… భారత్ ను అడిగి తీసుకుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇది మనం గర్వంగా చెప్పుకొనే అంశం కాదు.ఈ పరిస్థితుల్లో ‘అయిదోతరం యుద్ధవిమానాల కోసం విదేశాలపై ఆధారపడం. దేశీయ పరిజ్ఞానంతో తయారు చేయనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (అమ్కా) వైపు మళ్లుతాం’ అని ఇటీవల వాయుసేన అధిపతిగా బాధ్యతలు చేపట్టిన ఆర్ కేఎస్ బదౌరియా చెప్పడం శుభపరిణామం. అయిదోతరం యుద్ధవిమానానికి అత్యాధునిక పరిజ్ఞానం, వేగం, శక్తి ఉండాలి. చైనా జె-20, ఎఫ్ సీ-31, రష్యా సూ-57లు కూడా అయిదోతరం యుద్ధవిమానాలుగా చెప్పుకొంటున్నాయి. వచ్చే ఏడాది భారత్ చేతికి తొలి ఎస్ -400 క్షిపణి రక్షణ వ్యవస్థ రష్యా నుంచి అందనుంది. ‘అమ్కా’లో అత్యాధునిక ఏఈఎస్ ఏ (యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ యారే) రాడార్ , క్షిపణి హెచ్చరిక వ్యవస్థలు ఉండనున్నాయి. గతంలో విమాన కాక్ పిట్ లో ఉన్న పైలెట్ వివిధ వ్యవస్థలను సమన్వయం చేసుకొంటూ యుద్ధక్షేత్రంపై దృష్టిపెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేయనుండటంతో అన్ని రకాల సమాచారాలు, వ్యవస్థలను ఒకచోట నుంచే నియంత్రించే వెసులుబాటు లభిస్తుంది. భారత్ ఇప్పటికే అమెరికాతో సమాచార భద్రతకు సంబంధించి ‘కామ్ కాస’ (కమ్యూనికేషన్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ – సమాచార, అనుకూలత, భద్రత ఒప్పందం)పై సంతకం చేయడంతో విమానాన్ని యుద్ధవ్యూహాలకు అనుగుణంగా మార్చే అవకాశం ఉంది. తాజాగా దీనికి సంబంధించిన నమూనా తయారీ, పరీక్షలకు మంత్రిమండలి అనుమతులు కోరేందుకు రక్షణశాఖ సిద్ధమైంది.ప్రస్తుతం వాయుసేన వద్ద ఉన్న 31 స్క్వాడ్రన్లలో ఆరు మిగ్ -21, రెండు మిగ్ -27, ఆరు జాగ్వార్ , మూడు మిరాజ్ 2000, మూడు మిగ్ 29, పదకొండు సుఖోయ్ లు ఉన్నాయి. 1990 తరవాత స్క్వాడ్రన్ల సంఖ్య తగ్గుతూ వస్తోందే తప్ప పెరగలేదు. వాయుసేనకు మంజూరు చేసిన 42 స్క్వాడ్రన్ల బలాన్ని అది ఎప్పుడూ సమకూర్చుకోలేదు. మరోపక్క హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ ఏఎల్ )కు అప్పజెప్పిన యుద్ధవిమానాల అభివృద్ధి ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతోంది. త్వరలో మిగ్ -21, జాగ్వార్ , మిగ్ -27 చాలావరకు ఐఏఎఫ్ నుంచి తప్పుకొంటాయి. అప్పుడు యుద్ధ విమానాల సంఖ్య మరింత తగ్గిపోతుంది. సుఖోయ్ ల తరవాత దాదాపు 20 ఏళ్లకు తాజాగా ‘రఫేల్ ’ రూపంలో కొత్తరకం విమానాలను కొనుగోలు చేశారు. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ (అంతర్జాతీయ అస్త్రశక్తి సూచీ- జీఎఫ్ ఐ)లోని తొలి దేశాల్లో భారత్ తప్ప మిగిలినవి అయిదోతరం విమానాలను రూపొందించుకుంటున్నాయి. భారత్ మాత్రం 4.5 తరం ‘రఫేల్ ’ వైపు గర్వంగా చూస్తోంది.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అమెరికా, రష్యాలకు అయిదో తరం యుద్ధవిమానాలను అభివృద్ధి చేయడంలో పట్టిన సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే భారత్ కు ఇది పెద్దసవాలే. ‘తేజస్ ’ యుద్ధ విమానం అభివృద్ధి నుంచి నేర్చుకొన్న పాఠాలను వాయుసేన, అడా, డీఆర్ డీవో, హెచ్ ఏఎల్ కు ఇక్కడ ఉపయోగపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇంజిన్ల కోసం ప్రాజెక్టును ఏళ్లకేళ్లు జాప్యంచేయకుండా అమెరికాకు చెందిన జీఈ- 414 ఇంజిన్లను అమర్చాలని భావిస్తోంది. వీటిని ఇప్పటికే తేజస్ లో వినియోగించారు. మరోపక్క 110-125 కిలో న్యూటన్ల శక్తిని సాధించేందుకు జీటీఆర్ ఈ (గ్యాస్ టర్బయిన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్ మెంట్ ) చేపట్టిన కావేరీ ఇంజిన్ల అభివృద్ధి ప్రాజెక్టు నుంచి ఫ్రాన్స్ కు చెందిన ‘సాఫ్రన్ ’ సంస్థ వైదొలగినట్లు సమాచారం.లక్ష్యసాధనకు ఏం చేయడానికైనా చైనా వెనుకాడదు. ‘మంచిదేశం’ అనే గుర్తింపు కంటే ‘అజేయ సైనికశక్తి’ అన్న పేరుకే అంతర్జాతీయంగా ఎక్కువ విలువ ఉంటుందని ఆ దేశం గుర్తించింది. అందుకే వైమానిక రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టింది. తొలుత రష్యా విమానాలకు నకళ్లు తయారు చేయడం నేర్చుకొంది. ఈ అనుభవాలతో అయిదోతరానికి చెందిన రెండు యుద్ధవిమానాలను అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది. వీటి తయారీ కోసం అమెరికాకు చెందిన ఎఫ్ -22 రాఫ్టర్ , ఎఫ్ -35 విమానాల సమాచారాన్ని దొంగిలించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా అతితక్కువ వ్యవధిలోనే జె-20, ఎఫ్ సీ-31లకు ఒక రూపు ఇచ్చింది. విమాన ఇంజిన్ల కోసం చైనా ఏకంగా విదేశీ సంస్థలను కొనేందుకు వెనుకాడలేదు. ఉక్రెయిన్ లోని ‘మోటార్ సిచ్ ’ సంస్థకు విమాన ఇంజిన్ల తయారీలో మంచి పేరుంది. ఇందులో వాటాలు కొనుగోలు చేసిన కొందరు చైనా పెట్టుబడిదారులు సిబ్బంది నుంచి కీలక సమాచారం తెలుసుకొనేందుకు ఒత్తిడి తెచ్చారు. ఈ విషయాన్ని ఆ సంస్థ అధినేత వ్యాచెస్లావ్ బోగొస్లేవ్ వెల్లడించారు.‘తేజస్ ’ అనుభవాల నేపథ్యంలో కొత్తగా తయారయ్యే యుద్ధ విమానాలకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి, వాడకానికి సంబంధించిన ప్రాథమిక, తుది అనుమతులు వచ్చేసరికి కనీసం 18 ఏళ్లు పట్టవచ్చు. ఒక విమానం అభివృద్ధిలో ఇది సాధారణ సమయమే. కానీ, వాయుసేన అవసరాల కోణంలో చూస్తే ఇది చాలా ఎక్కువ సమయం. తాజాగా అభివృద్ధి చేస్తున్న మిరాజ్ , జాగ్వార్ లకు 2032 నాటికి కాలం చెల్లుతుంది. ఈ పరిస్థితుల్లో ‘అమ్కా’కు తుది అనుమతులు వచ్చేనాటికే అయిదోతరం యుద్ధవిమానాలను భారీస్థాయిలో ఉత్పత్తి చేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరానికి అనుగుణంగా ‘తేజస్ ’ ఉత్పత్తి లేదని ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఏడాదికి ఎనిమిది విమానాల తయారీ- వాయుసేన అవసరాలను తీర్చలేదు. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ఏడు ఐఏఎఫ్ యుద్ధ విమానాలు కూలిపోయాయి. వీటిల్లో మిగ్ , సుఖోయ్ , జాగ్వార్ విమానాలు ఉన్నాయి. ఈ లెక్కన ‘తేజస్ ’ ఉత్పత్తి, కోల్పోయే విమానాలను భర్తీ చేయడానికి సరిపోకపోవచ్చు. ఉత్పత్తిని రెట్టింపు చేసినా యుద్ధ విమానాల సంఖ్యను పెంచలేం. కేవలం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ ఏఎల్ ) మీదే ఆధారపడితే ఇది సాధ్యం కాదు. ‘అమ్కా’ ప్రాజెక్టులో ప్రైవేటు రంగాన్ని భాగస్వామి చేయాల్సిన అవసరం ఉంది. అమెరికా, ఫ్రాన్స్ లలో ప్రైవేటు రంగమే కీలక పాత్ర పోషిస్తోంది. భారత్ లోనూ టాటా (టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ లిమిటెడ్ – టీఏఎస్ ఎల్ ), మహీంద్రా ఏరోస్పేస్ , డసో-రిలయన్స్ , అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ , హిందాల్కో-అల్మెక్స్ ఏరోస్పేస్ వంటి ప్రైవేటు సంస్థలు ఈ దిశగా అడుగులు వేశాయి. విడిభాగాల తయారీలో చిన్న, మధ్యశ్రేణి సంస్థలను పెద్దసంఖ్యలో భాగస్వాములను చేయాలి. అప్పుడే ప్రాజెక్టు అనుమతులు వచ్చాక ఉత్పత్తిని వేగంగా పెంచవచ్చు.బాలాకోట్ దాడుల తరవాత చోటుచేసుకొన్న పరిణామాలు వాయుసేన ఆధునికీకరణ అంశాన్ని మరోసారి నొక్కిచెప్పాయి. కాలంచెల్లిన విమానాలతో యుద్ధాల్లో విజయాలు సాధించడం ఎలా సాధ్యం? అదే సమయంలో ఆయుధ కొనుగోళ్లు దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా మారుతున్నాయి. అంతర్జాతీయ అస్త్రశక్తి సూచీ ప్రకారం భారత్ ప్రపంచలోనే నాలుగో అతిపెద్ద సైనిక శక్తి. కానీ ఈ సూచీలో మన ముందు, మన తరవాత ఉన్న దేశాలు చాలావరకు ఆయుధాలను దేశీయంగానే ఉత్పత్తి చేసుకొంటున్నాయి. భారత్ మాత్రం దిగుమతులపై ఆధారపడింది. అందుకే కార్గిల్ యుద్ధం వంటి సంక్షోభ సమయాల్లో ఇతర దేశాల సాయాన్ని అర్థించాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సైన్యం, నౌకాదళం చేసిన ప్రయత్నాలు కొంతవరకు సత్ఫలితాలను ఇచ్చాయి. సైన్యం అర్జున ట్యాంకులు, ధనుష్ శతఘ్నులను; నౌకాదళం ‘అరిహంత్ ’ వంటి జలాంతర్గాములను అభివృద్ధి చేశాయి. ఇప్పుడు వాయుసేన వంతు వచ్చింది!రష్యాతో కలిసి అయిదోతరం యుద్ధవిమానాల (ఎఫ్ జీఎఫ్ ఏ- ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ )ను అభివృద్ధి చేయాలని 2007లో భారత్ భావించింది. ఈ ఆలోచన ముందుకు సాగి ఉంటే 2020 నాటికి అత్యాధునిక యుద్ధవిమానం మనకు అందుబాటులోకి వచ్చేది. కానీ, ఈ ప్రాజెక్టులో 50శాతం పెట్టుబడి పెట్టాలన్న షరతు విధించిన రష్యా కీలకమైన సాఫ్ట్ వేర్లు, మిషిన్ కంప్యూటర్ , కాక్ పిట్ సాంకేతికతను భారత్ తో పంచుకోవడానికి ఇష్టపడలేదు. పనిభాగస్వామ్యం, పరిశోధనల్లోనూ భారత్ పాత్రను పరిమితం చేసింది. ఒప్పందం ప్రకారం సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సమానంగా పంచుకోవడానికి అంగీకరించలేదు. దీంతో భారత్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొంది. కాలహరణం మినహా దీని నుంచి పెద్దగా ఒరిగిందేమీ లేదు. విమానాల అభివృద్ధికి అవసరమైన సాంకేతికత అత్యంత వ్యయప్రయాసలతో కూడుకొన్నది. ఈ సాంకేతికతను ఏ సంస్థా మరొకరితో పంచుకోవాలనుకోదు. యుద్ధ విమానాలను అభివృద్ధి పరచాలంటే పరిశోధనలపై పెట్టుబడులు పెరగాలి. ప్రస్తుతం పరిశోధనలపై జీడీపీలో సుమారు 0.7శాతం భారత్ ఖర్చు చేస్తోంది. చైనా (2.1), అమెరికా (2.8), ఇజ్రాయెల్ (4.3) దక్షిణ కొరియా(4.2)శాతం వ్యయీకరిస్తున్నాయి. ఒక రంగం కోసం పరిశోధన చేస్తే వాటి ఫలితాలు ఇతర రంగాలకూ ఉపయోగపడతాయి. ఈ విషయం వైమానిక రంగానికీ వర్తిస్తుంది. ఈ క్రమంలో పరిశోధనలపై వెచ్చించే మొత్తాన్ని పెంచేందుకు భారత్ చర్యలు చేపట్టింది. కంపెనీలు చెల్లించే కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ (సీఎస్ ఆర్ ) నిధిని జాతీయ పరిశోధనశాలలకు మళ్లించే అవకాశాన్ని కల్పించింది. ఇది ఆయా సంస్థలకు నిధుల కొరతను తీర్చి పరిశోధనలను ముమ్మరం చేస్తుంది.

About The Author