దివ్యాంగులకు బాసటగా మాజీ ఎంపీ కవిత


-మాజీ ఎంపీ కవిత చొరవతో 471 మంది దివ్యాంగులకు బ్యాటరీ మోటార్ ట్రై సైకిళ్ల మంజూరు
-గత నవంబర్‌లో ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ. 56.52 లక్షలు చెల్లించిన కవిత
-జిల్లాకు చేరిన ట్రై సైకిళ్లు

ఎంపీ కల్వకుంట్ల కవిత కృషి ఫలించింది. ఆమె తీసుకున్న చొరవ దివ్యాంగులకు బాసటగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి బ్యాటరీతో నడిచే మోటారు ట్రై సైకిళ్లను జిల్లాలోని దివ్యాంగులకు ఇప్పించేందుకు ఆమె ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తన ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.56.52 లక్షలను ఈ సైకిళ్లకు కేటాయించి వెంటనే మంజూరు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి గతేడాది నవంబర్‌లో లేఖ రాశారు. స్పందించిన కేంద్రం జిల్లాలో అవసరమైన 471 మంది దివ్యాంగులకు అధునాతన బ్యాటరీ మోటారు ట్రై సైకిళ్లను మంజూరు చేసింది. అవి జిల్లా కేంద్రానికి చేరాయి. జిల్లా దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం మంగళవారం(నేడు) లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం అర్హులైన దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను అందించాలని శిబిరాలను ఏర్పాటు చేసి లబ్ధిదారులను గుర్తించే కార్యక్రమం నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ (అలీంకో) ద్వారా గతేడాది సెప్టెంబర్‌లో వైద్య శిబిరాన్ని నిర్వహించి అర్హులైన దివ్యాంగులను ఎంపిక చేశారు. బోధన్‌లో గతేడాది సెప్టెంబర్ 17న వైద్య శిబిరం నిర్వహించగా… 140 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆర్మూర్‌లో సెప్టెంబర్ 18న వైద్య శిబిరం నిర్వహించి 157 మంది లబ్ధిదారులను గుర్తించారు. నిజామాబాద్ అర్బన్‌లో సెప్టెంబర్ 19న వైద్య శిబిరం నిర్వహించగా… 174 మంది ట్రై సైకిళ్లు పొందేందుకు అర్హులుగా గుర్తించారు. మొత్తం జిల్లాలో మూడ్రోజుల పాటు వైద్య శిబిరాన్ని నిర్వహించి 471 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో జిల్లాకు 373 ట్రై సైకిళ్లు ఇప్పటి వరకు చేరాయి. వీటిని నేడు పంపిణీ చేయనున్నారు. మిగతావి త్వరలో తెప్పించి లబ్ధిదారులకు అందించనున్నారు. ఒక్కో ట్రై సైకిల్ విలువ రూ. 37వేలుగా ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ. 25వేలు భరిస్తుండగా.. ఎంపీ ల్యాడ్స్ నుంచి అప్పటి ఎంపీ కవిత రూ. 12వేల చొప్పున 471 మందికి రూ. 56.52 లక్షలను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించారు. దీంతో ఈ లబ్ధిదారులకు అధునాతనంగా తయారు చేసిన బ్యాటరీతో నడిచే మోటారు ట్రై సైకిళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ ట్రై సైకిళ్ల మంజూరు కోసం ప్రత్యేకంగా ఎంపీ కవిత చొరవ తీసుకొని నవంబర్‌లో ఓ లేఖ రాశారు. జిల్లాలో నిర్వహించిన వైద్య శిబిరాల్లో 471 మంది ఎంపికయ్యారని, వీటికి సంబంధించి తన నిధుల నుంచి రూ. 56.52 లక్షలు అలీంకో సంస్థకు చెల్లిస్తున్నట్లుగా లేఖ రాశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది. ఎట్టకేలకు జిల్లాలోని 471 మంది దివ్యాంగులకు మాజీ ఎంపీ కవిత కృషితో ట్రై సైకిళ్లు దక్కనున్నాయి. వీరంతా ఇప్పుడు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీ కవిత తమ సోదరిగా దగ్గరుండి లబ్ధిదారుల ఎంపిక మొదలుకొని ట్రై సైకిళ్లు మంజూరయ్యే వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని గుర్తు చేసుకుంటున్నారు. కవితకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. దివ్యాంగుల దీవెనలు ఆమెకు అందనున్నాయి.

About The Author