తల్లిదండ్రుల విడాకులపై స్పందించిన శ్రుతిహాసన్
చెన్నై: ప్రతిఒక్కరి జీవితంలో కష్టాలు, బాధలు భాగమేనని నటి శ్రుతిహాసన్ అన్నారు. విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తెగా వెండితెరకు పరిచయమైన ఆమె.. నటనలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల సినిమాల నుంచి కొంత విరామం తీసుకుని తనకెంతో ఇష్టమైన సంగీతంలో ఆమె శిక్షణ తీసుకున్నారు. తాజాగా ఆమె ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు. ‘మీరు మీ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించినా సరే కష్టాలు, బాధలు అనేవి అనివార్యమే. ఎందుకంటే ప్రతిఒక్కరి జీవితంలో బాధలు కూడా ఓ భాగం’ అని శ్రుతి హాసన్ పేర్కొన్నారు.
తన తల్లిదండ్రులు సారిక, కమల్‌హాసన్ విడాకులు గురించి శ్రుతి మాట్లాడుతూ.. ‘ఓ జంట విడాకుల విషయం ఆ ఇంట్లో వాళ్లకు వార్త కాదు. కానీ వారి చుట్టుపక్కల ఉండేవారికి అదో పెద్ద వార్త. నా తల్లిదండ్రులు వ్యక్తిగతంగా చాలా మంచివాళ్లు. విడిపోయినా కూడా వాళ్లు సంతోషంగానే ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా తల్లిదండ్రులు కావడానికంటే ముందు వారిద్దరూ మామూలు వ్యక్తులే అనే విషయాన్ని నేను ఎప్పుడో అర్థం చేసుకున్నాను. నిజం చెప్పాలంటే ఓ జంట విడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమే. కాకపోతే ఒక జంట మధ్య సరైన అనుబంధం లేనప్పుడు.. వారు విడిపోవడమే మంచిది. ఆ జంట కలిసి ఉండడం కోసం వారి అనుబంధానికి ఎటువంటి అతుకులు వేసినా ఎదో ఒకరోజు అది ధ్వంసం కాకతప్పదు’ అని శ్రుతి హాసన్ వ్యాఖ్యానించారు.
‘కాటమరాయుడు’ చిత్రం తర్వాత శ్రుతిహాసన్ చాలా రోజుల పాటు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఆమె మరోసారి తెలుగు తెరపై సందడి చేయనున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో రవితేజకు జంటగా శ్రుతి నటించనున్నారు. ఈ చిత్రంలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.