అయోధ్యపై శనివారమే తుదితీర్పు… దేశవ్యాప్తంగా హైఅలర్ట్
ఢిల్లీ:అయోధ్యలోని వివాదాస్పద రామజన్మ భూమిపై శనివారం సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. ఉదయం 10.30కి రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు ఇవ్వనన్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. తీర్పు సందర్భంగా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇప్పటికే యూపీలో కేంద్ర బలగాలను మోహరించారు. అంతేకాకుండా 4వేల పారా మిలటరీ దళాలు, బాంబ్ స్క్వాడ్స్ తరలించారు. యూపీలో 24 గంటలు పనిచేసే మాస్టర్ కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశారు. 20 తాత్కాలిక జైళ్లను యూపీ సర్కార్ ఏర్పాటు చేసింది. భద్రతను మరింత పటిష్టం చేయాలని 75 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. యూపీ అధికారులతో సీజేఐ గొగోయ్ సమీక్ష జరిపారు.
అయోధ్య కేసులో 40రోజుల పాటు విచారణ కొనసాగింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది. 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. అయోధ్యలో 144 సెక్షన్ కొనసాగుతోంది. కోర్టు తీర్పు ఎలా ఉన్నా విజయోత్సవాలు వద్దని ఆర్‌ఎస్‌ఎస్ పిలుపునిచ్చింది. తీర్పును శిరసావహించాలని ముస్లిం మత పెద్దలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. హిందూ-ముస్లిం సఖ్యతకు ప్రయత్నిస్తూనే ఉంటామని మత పెద్దలు చెబుతున్నారు.
తీర్పు నేపథ్యంలో భద్రతా సంస్థలన్నీ సోషల్ మీడియాపై కూడా నిఘా పెట్టాయి. అయోధ్య తీర్పు వెలువడనున్న తరుణంలో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రమంతటా గురువారం నుంచే సోషల్ మీడియాపై నిఘా ఉంటుందని నిబంధనలు అమలులోకి వస్తాయన్నారు. వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌తో పాటు అన్ని సోషల్ మీడియా ఖాతాలపైనా రాష్ట్ర పోలీసులచే నిఘా కొనసాగిస్తున్నారు. కేంద్ర ఇంటలిజెన్స్ సూచనలకు అనుగుణంగా సోషల్ మీడియాపై పర్యవేక్షణ ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.