షుగర్ తో ఎన్నెన్ని బాధలో… ??


మధుమేహం తీయని శత్రువు! చడీ చప్పుడు లేకుండా.. చాపకింద నీరులా.. ప్రతి కణాన్ని, ప్రతి అవయవాన్ని దెబ్బతీస్తుంది. ఎన్నెన్నో దుష్ప్రభావాలను తెచ్చిపెడుతుంది. అవి ఏమిటో చూడండి….
పాదాల మంట
============
దీనికి ప్రధాన కారణం నాడులు దెబ్బతినటం. ముఖ్యంగా స్పర్శ నాడులు దెబ్బతిన్నప్పుడు పాదాలు మొద్దుబారినట్టూ, దూది మీద నడుస్తున్నట్టూ అనిపిస్తుంటుంది. మేకుల వంటివి గుచ్చుకున్నా తెలియదు. కొందరికి చర్మానికి ఏమీ తాకకపోయినా తాకినట్టు ఉంటుంది. గాజు పెంకుల మీద నడుస్తున్నట్టు, చీమలు పాకుతున్నట్టు, సూది పెట్టి గుచ్చినట్టు ఉంటుంది. ఫ్యాను గాలి తగిలినా పాదాలు మండినట్టు అనిపించొచ్చు. ఇలాంటి సమస్యలు మధుమేహం బయటపడిన తొలిరోజు నుంచే ఎంతో కొంత ఉండటం గమనార్హం.
విరేచనాలు-మలబద్ధకం
===================
తిన్న ఆహారం సాధారణంగా 30-45 నిమిషాల్లో జీర్ణాశయం నుంచి కిందికి వెళ్లిపోతుంది. మధుమేహుల్లో ఇందుకు చాలా సమయం పడుతుంది (గ్యాస్ట్రో పెరెసిస్‌). చిన్న, పెద్ద పేగుల కదలికలూ మందగిస్తాయి. దీంతో కడుపుబ్బరం, మంట, తేన్పుల వంటివి ఇబ్బంది పెడతాయి. గ్లూకోజు నియంత్రణకు వాడే మెట్‌ఫార్మిన్‌, గ్లిప్టిన్‌ రకం మందులూ వీటికి దోహదం చేయొచ్చు. పేగుల్లో ఆహారం నెమ్మదిగా కదలటం వల్ల మలబద్ధకం, విరేచనాలు మార్చి మార్చి వేధిస్తుంటాయి.
జననాంగ ఇన్‌ఫెక్షన్లు
==================
వీటికి ప్రధాన కారణం తెల్ల రక్తకణాల పనితీరు అస్తవ్యస్తం కావటం, యాంటీబాడీల ఉత్పత్తి తగ్గటం. ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గిపోయి.. జననాంగ భాగాల్లో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు తలెత్తుతాయి. మగవారిలో అంగం మీద తెల్లటి పొర ఏర్పడి, పగిలినట్టు అవుతుంది (బెలనైటిస్‌). ఆడవారిలో ఇది తెల్లబట్ట (వజైనల్‌ మొనీలియాసిస్‌) రూపంలో కనబడుతుంది. గ్లూకోజు నియంత్రణలో ఉంచుకోవటం వీరికి మేలు చేస్తుంది. గ్లూకోజు నియంత్రణలోకి వచ్చిన మూడో రోజే వాటంతటవే తగ్గిపోతాయి. చిక్కేంటంటే ఇవి తరచుగా వచ్చి, పోతుండటం. దీంతో మగవారు అంగం మంట, ఆడవారు తెల్లబట్టతో నిరంతరం సతమతమవుతూ ఉంటారు.
మాటిమాటికీ మూత్రం
================
చికాకుకు గురిచేసే సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇదే. ఆడవాళ్లను మరింతగా ఇబ్బంది పెడుతుంది. ఎక్కడికన్నా వెళ్లాలన్నా భయపడిపోతుంటారు. రక్తంలో గ్లూకోజు మోతాదులు ఎక్కువుంటే శరీరం దాన్ని మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంటుంది. దీంతో మూత్రం ఎక్కువగా వస్తుంది. గ్లూకోజు నియంత్రణలో ఉంటే పగటిపూట తగ్గొచ్చు గానీ రాత్రిపూట వేధిస్తూనే ఉంటుంది. నాలుగైదు సార్లు నిద్రలోంచి లేవాల్సీ రావొచ్చు. మధుమేహులకు సహజంగానే మూత్రకోశ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ. దీనికి తోడు స్వయం చాలిత నాడీవ్యవస్థ దెబ్బతినటం వల్ల మూత్రాశయం సరిగా సంకోచించదు. ఫలితంగా మూత్రం పూర్తిగా ఖాళీ కాదు. కొంత లోపలే ఉండిపోతుంటుంది. ఇది మూత్రాశయాన్ని చికాకుకు గురిచేయటం వల్ల ఎప్పుడూ మూత్రం వస్తున్నట్టు అనిపిస్తుంటుంది. మగవారిలో ప్రోస్టేట్‌ గ్రంథి ఉబ్బటమూ దీనికి దోహదం చేస్తుంది.
నోటి దుర్వాసన
=============
దీనికి మూలం నోరు ఎండిపోవటం. మధుమేహంలో లాలాజలం ఉత్పత్తి తగ్గిపోయి.. నోట్లో రక్షణ వ్యవస్థ, శుభ్రత దెబ్బతింటాయి. అలాగే పేగుల్లో ఆహారం ఎక్కువసేపు నిల్వ ఉండటం, రోగనిరోధక శక్తి తగ్గటం వల్ల తలెత్తే చిగుళ్లవాపు దీనికి మరింత ఆజ్యం పోస్తుంటాయి. మధుమేహుల్లో ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గటం కూడా సమస్యే. దీంతో శ్వాస ద్వారా బయటకు వచ్చే గాలి పరిమాణం తగ్గి.. స్రావాలు లోపలే ఉండిపోతుంటాయి. ఇవన్నీ దుర్వాసన కలగజేస్తాయి. మంచి విషయం ఏంటంటే- నోటి దుర్వాసనను, చిగుళ్ల వాపును నివారించుకున్నా.. తగు చికిత్స తీసుకున్నా మందులతో పనిలేకుండానే రక్తంలో గ్లూకోజు మోతాదులు సగానికి సగం తగ్గిపోవటం. అంతేకాదు, గుండెజబ్బులూ దరిజేరవు. వచ్చినా అంత తీవ్రంగా ఉండవు
స్తంభన లోపం
============
మగవారిలో అంగం సరిగా గట్టిపడకపోవటం మరో సమస్య. దీనికి ముఖ్య కారణం స్వయం చాలిత నాడీ వ్యవస్థ దెబ్బతినటం. అంగం గట్టిపడినా కొందరికి స్ఖలనం వెంటనే అవుతుంటుంది. కొన్నిసార్లు వీర్యం మూత్రాశయంలోకి వెనక్కి మళ్లిపోవచ్చు. వీటి గురించి బయటకు చెప్పుకోలేక చాలామంది లోలోపలే సతమతమైపోతుంటారు. అప్పటికే పిల్లలు ఉండటం, పిల్లలు పెద్దగా అవ్వటం, ఇతరత్రా సమస్యలతో బాధపడుతుండటం వల్ల దీన్ని పెద్దగా పట్టించుకోరు. కొందరు డాక్టర్ల సలహా లేకుండా వయాగ్రా వంటి మాత్రలనూ ఆశ్రయిస్తుంటారు గానీ గుండెజబ్బులు గలవారికివి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తాయి
దురద
=========
దీనికి మూలం చర్మం పొడిబారటం. మధుమేహం గలవారిలో చెమట పోయటం చిత్రంగా ఉంటుంది. చర్మం మడతల్లో, దుస్తులు ఉన్నచోట చెమట ఎక్కువగా పోస్తే.. మిగతా చోట్ల అసలేమీ పోయదు. ఇలా చర్మం పొడినబారిన చోట దురదలు వస్తుంటాయి. కాలేయ సమస్యలు, రక్తకణాల్లో లోపాలూ ఇందుకు దోహదం చేయొచ్చు. రోగనిరోధక శక్తి తగ్గటం వల్ల తలెత్తే చర్మ సమస్యలూ దురదను తెచ్చిపెడతాయి.

About The Author