కాచిగూడ రైలు ప్రమాదం: క్యాబిన్‌లో ఇరుక్కుని లోకో పైలెట్ మృతి

హైదరాబాద్: కాచిగూడ స్టేషన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఎంఎంటీఎస్ లోకో పైలెట్ శేఖర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయి మృతి చెందాడు. రైలు ముందు భాగం నుజ్జునుజ్జు అవడంతో లోకో పైలెట్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్య బృందం ఘటనాస్థలికే వెళ్లి చికిత్స అందించేందుకు ప్రయత్నించింది. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. జీహెచ్ఎంసీకి చెందిన డీఆర్ఎఫ్ టీమ్‌లు, గ్యాస్ కట్టర్ టీమ్‌లు కూడా లోకో పైలెట్‌ను బయటకు తీసేందుకు ఎంతగానో ప్రయత్నించాయి.

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలును ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు వెనుక నుంచి ఢీకొన్న విషయం తెలిసిందే. సిగ్నలింగ్ లోపంతో ఎక్స్‌ప్రెస్ రైలు ఆగి ఉన్న ట్రాక్‌పైనే ఎంఎంటీఎస్ రైలు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదధాటికి ఎంఎంటీఎస్ రైలులో ఉన్న పలువురు ప్రయాణికులు ముళ్ల పొదల్లోకి ఎగిరిపడ్డట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

About The Author