రజకులు టైలర్లు నాయీ బ్రాహ్మణులకు 10 వేల ఆర్థిక సహాయం…


నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ
జనవరి 26 కల్లా లబ్ధిదారుల అకౌంట్లలో రూ.10 వేలు జమ
మార్గదర్శకాలు విడుదల చేసిన బీసీ సంక్షేమశాఖ

రజకులు, టైలర్లు, నాయీబ్రాహ్మణులకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించేందుకు ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. ఆయా వృత్తులు నిర్వహిస్తున్న లబ్ధిదారులు ఆదివారం నుంచి దరఖాస్తులు చేసుకోవాలని బీసీ ఆర్థికసహకారం సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది.

లబ్ధిదారులు ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, తెల్ల రేషన్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌, స్థిర, సంచార(యూనిట్లు/దుకాణాలు/తోపుడుబండ్లు రిజిస్ట్రేషన్ల పత్రాలను) నవంబరు 30 లోపు సమర్పించాలి.

ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను ఆయా గ్రామ/వార్డు వలంటీర్లు పరిశీలించి స్థిర, సంచార యూనిట్లను జియోట్యాగ్‌ చేసి అప్‌లోడ్‌ చేస్తారు. వాటిని గ్రామ/వార్డు వలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు/బిల్లు కలెక్టర్లు డిసెంబరు 15 లోపు పరిశీలిస్తారు. లబ్ధిదారుల అర్హతలను క్రాస్‌ చెక్‌చేసి ఆయా సెక్రటరీలు/బిల్లు కలెక్టర్లు డిసెంబర్‌ 31 లోపు ఎంపీడీవో/మున్సిపల్‌ కమిషనర్‌ లాగిన్‌కు అప్‌లోడ్‌ చేస్తారు.

వారు పరిశీలించి అర్హులను బీసీ ఆర్థిక సహకారసంఘం జిల్లా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌కు జనవరి 10 లోపు పంపిస్తారు.

ఈ వివరాలను ఆయా జిల్లాల ఈడీలు జనవరి 15 లోపు ఆయా జిల్లా కలెక్టర్లకు సమర్పిస్తారు. ఈ ఆమోదించిన జాబితాను ఆయా ఈడీలు, జిల్లాల కలెక్టర్లు రాష్ట్ర బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వీసీ అండ్‌ ఎండీ కి జనవరి 25 లోపు పంపి లబ్ధిదారుల అకౌంట్లలో ఆర్థిక సాయం జమ చేసేలా చర్యలు తీసుకుంటారు. ప్రతిస్థాయిలో లబ్ధిదారుడికి ఎప్పటికప్పుడు తెలుగులో మెసేజ్‌ వస్తుంది. 2019-20 నుంచి 2023-24 వరకు ఐదేళ్లలో ప్రతి ఆర్థిక సంవత్సరానికి లబ్ధిదారులందరికీ రూ.10 వేలు వంతున రూ.50 వేలు జమ అవుతుంది.

About The Author