రాహుల్ & ఫ్యామిలీకి ఎందుకు SPG రక్షణ ఉపసంహరించారు ?


రాహుల్ & ఫ్యామిలీకి ఎందుకు SPG రక్షణ ఉపసంహరించారు ?
ఎందుకంటే వారి రూల్స్ పాటించట్లేదు కనుక. వివరాలు చూద్దాం :

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌, కుమార్తె ప్రియాంక గాంధీలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రత దళ రక్షణ(స్పెషల్‌ ప్రొటెక్షన్ గ్రూప్‌-ఎస్పీజీ)ను ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయితే.. రాహుల్‌, సోనియా, ప్రియాంక ఎస్పీజీ నియమాలను పలుసార్లు ఉల్లంఘించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీరి ముగ్గురికీ ‘జడ్‌ ప్లస్‌’భద్రతను కల్పిస్తున్నట్లు వెల్లడించిన తర్వాత కొందరు అధికారులు దీనిపై మాట్లాడారు.

‘ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తికి 3 వేలమందితో కూడిన ఎస్పీజీ భద్రతను ఏర్పాటు చేశారు. అదే క్రమంలో 1991 నుంచి గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత ఉంది. గత కొన్నాళ్లుగా గాంధీ కుటుంబీకులు ఈ భద్రతా నియమాలను ఉల్లంఘిస్తున్నారు. భద్రతా సిబ్బందికి వారు సహకరించడం లేదు. 2015 నుంచి మే 2019 వరకు రాహుల్‌ 1,892 సార్లు నియమాలను ఉల్లంఘించారు. అంటే సగటున రోజుకు ఒకసారి ఆయన నిబంధన ఉల్లంఘనకు పాల్పడ్డారు. బుల్లెట్‌ రెసిస్టెంట్‌ వాహనాన్ని తిరస్కరించి దిల్లీలో సంచరించారు. ఇక 250 సార్లు నాన్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో దిల్లీ బయట ప్రయాణించారు. విదేశీ పర్యటనల సమయంలోనూ రాహుల్‌ నియమాలను పాటించలేదు. ఆయన 1991 నుంచి 156 విదేశీ ప్రయాణాలు చేయగా.. అందులో 143 సార్లు ఎస్పీజీ అధికారులు లేకుండానే వెళ్లారు. సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ ఇద్దరూ కలిసి 389 సార్లు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు లేకుండా ప్రయాణించారు’ అని అధికారులు మీడియాకు చెప్పారు.

About The Author