అయోధ్య శ్రీరామ ఆలయం నమూనా :


చంద్రకాంత్‌ సోంపురా(78) 1989లో నాటి విశ్వహిందూ పరిషత్‌ చీఫ్‌ అశోక్‌ సింఘాల్‌ వినతి మేరకు రామాలయ నిర్మాణానికి డిజైన్‌ గీశారు. 1990లో అలహాబాద్‌లో కుంభ మేళా సమయంలో సమావేశమైన సాధువులు ఈ ఆకృతికి సమ్మతించారు.

చంద్రకాంత్‌ సోంపురా.. అయోధ్య తీర్పు వెలువడిన కొద్ది గంటలకే ఈయన పేరు పతాక శీర్షికల్లో చేరిపోయింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితమే డిజైన్‌ రూపొందించిన శిల్పి ఈయనే.

ఈ డిజైన్‌లో పేర్కొన్న విధంగా శిల్పులు శిల్పాలు, స్తంభాల్లో 40 శాతం వరకు ఇప్పటికే చెక్కారు. నిర్మాణ పనులు పూర్తి చేయాలంటే కనీసం రెండున్నరేళ్లు పడుతుందని చంద్రకాంత్‌ వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ట్రస్ట్‌ ఏర్పాటు, వనరుల సమీకరణకు కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. రామ మందిర నిర్మాణ నినాదానికి తోడుగా ఈ నమూనానే ఇంటింటికీ చేరింది. అందుకే ఇదే డిజైన్‌తో ఆలయం రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరో నమూనా రూపొందించి, మళ్లీ దానికి తగిన రీతిలో రాయి సమకూర్చుకోవడం వంటి అంశాలు ఇమిడి ఉన్నందున తగు సమయం పట్టే అవకాశం ఉంది. పైగా చంద్రకాంత్‌ సోంపురా కుటుంబమే దేశ విదేశాల్లోని వందలాది ఆలయాలకు నమూనాలను అందించింది. చంద్రకాంత్‌ సోంపురా తండ్రి ప్రభాకర్‌ సోంపురా గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌ ఆలయానికి, మథురలోని శ్రీకృష్ణ ఆలయానికి డిజైన్‌ అందించారు. చంద్రకాంత్‌ సోంపురా స్వయంగా 100 ఆలయాలకు శిల్పిగా వ్యవహరించారు. ఇందులో గుజరాత్‌లోని స్వామి నారాయణ్‌ మందిర్‌ వంటి ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. ఆలయ పనులు ప్రారంభమవుతాయని, వచ్చే శ్రీరామనవమికి ఆలయ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వీహెచ్‌పీ నేతలు అంటున్నారు.

సోంపురా రూపొందించిన నమూనా ఇలా
► ఆలయ నిర్మాణానికి ఆరున్నర ఎకరాల స్థలం అవసరం.
► ఉత్తర భారతంలో ప్రఖ్యాతి గాంచిన ‘నగర’ శైలిలో ఆలయం ఉంటుంది.
► గర్భ గృహం, అంత్రల్, మహా మండపం, రంగ మండపం, ప్రవేశ మండపం.. ఇలా ఐదు భాగాలుగా ఉంటుంది. వీటి గుండానే రాముడి దర్శనం ఉంటుంది.
► గర్భ గృహానికి ఒక ద్వారం, మహా మండపానికి 7 ద్వారాలు ఉంటాయి.
► ఈ ఆకృతిలో ఆలయ నిర్మాణానికి 2.75 లక్షల ఘనపుటడుగుల రాయి అవసరం. ఇప్పటికే 1.25 లక్షల ఘనపుటడుగుల రాయిని చెక్కారు.
► ఈ నమూనా ప్రకారం 270 అడుగుల పొడవు, 126 అడుగుల వెడల్పు, 132 అడుగుల ఎత్తుతో ప్రధాన ఆలయ కట్టడం ఉంటుంది. ఇందులో 81 అడుగుల మేర గోపుర శిఖరం ఉంటుంది.
► 212 స్తంభాలతో నిర్మాణం ఉంటుంది.
► ప్రధాన ఆలయం రెండంతస్తుల్లో ఉంటుంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో బాల రాముడి విగ్రహం, మొదటి అంతస్తులో రామ దర్బారు ఉంటుంది. ఆ పైన ఆలయ శిఖరం ఉంటుంది.
► ప్రధాన ఆలయానికి ఒకవైపు కథా కుంజ్‌ ఉంటుంది.
► రాజస్తాన్‌ రాష్ట్రంలోని భరత్‌పూర్‌ జిల్లా బన్సి పహార్‌పూర్‌ నుంచి తెచ్చిన గులాబీ రంగు రాయితో ఇప్పటికే దాదాపు 40 శాతం మేర శిల్పాల పనులు పూర్తయ్యాయి.
► ఆలయ నిర్మాణంలో స్టీలు అవసరం లేదు. 990లో అలహాబాద్‌లో కుంభ మేళా సమయంలో సమావేశమైన సాధువులు ఈ ఆకృతికి సమ్మతించారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన రాతి స్తంభాలను మలిచేందుకు ప్రత్యేక కార్యశాల ఏర్పాటు చేశారు.

About The Author