శ్రీకార్తీక పురాణము 16వ అధ్యాయము…
కార్తీకమాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఈ మాసమందు స్నాన, దాన, , వ్రతములను చేయుట, సాలగ్రామ దానము చాలా ముఖ్యము. ఈ నెలదినములు తాంబూలదానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. అధేవిదంగానే నెలరోజులలో ఏ ఒక్కరోజూ విడవకుండా తులసికోటవద్దగాని, భగవంతుని సన్నిధినగాని దీపారాధన చేసిన యెడల సమస్త పాపములు నశించటమేకాక వైకుంఠప్రాప్తి కలుగును. కార్తీకశుద్ధ పౌర్ణమిరోజున నదీస్నానమాచరించి, భగవంతుని సన్నిధియందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు, నారికేళ ఫలదానము చేసిన యెడల చిరకాలము నుండి సంతతి లేనివారికి పుత్ర సంతానము కలుగును.
సంతానము వున్నవారు చేసినచో సంతాన నష్టము జరుగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై వుంటారు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశదీపము వుంచిన వారు వైకుంఠంలో సకల భోగములు అనుభవిస్తారు. కార్తీకమాసమంతా ఆకశ దీపముగాని, స్తంభదీపముగాని వుంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి, వారి జీవితము ఆనందదాయకమవుతుంది. ఆకాశదీపం పెట్టువారు శాలిధాన్యంగాని, నువ్వులుగాని ప్రమిద అడుగున పోసి దీపము వుంచాలి. దీపము పెట్టడానికి శక్తి వుండి కూడా దీపము పెట్టనివారు, దీపము పెట్టువారిని పరిహాసమాడువారు చుంచుజన్మ ఎత్తుతారు. ఇందుకొక ఇతిహాసము కలదు.
దీపస్తంభము విప్రుడగుట
ఋషులలో అగ్రగణ్యుడు అని పేరుపొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని, దానికి దగ్గరలో ఒక విష్ణుమందిరాన్ని కూడా నిర్మించుకొని, నిత్యము పూజలు చేస్తుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుప్రక్కల గల మునులు కూడా వచ్చి పూజలు చేసేవారు. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి, కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్లుచుండెవారు ఇకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు మిగత మునులను చూసి ” ఓ సిద్దులారా! కార్తీకమాసంలో హరిహరాదుల ప్రీతికొరకు స్తంభదీపమును వుంచినచో వైకుంఠప్రాప్తి కలుగుతుంది అని మనకందరికి తెలిసిన విషయమే కదా! రేపు కార్తీక పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి, దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికెళ్లి నిడుపాటి స్తంభమును తీసుకొద్దము రండి” అని పలుకగా అందరు పరమానందభరితులై అడవికివెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయములో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై శాలిధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో వత్తివేసి దీపము వెలిగించిరి. తర్వాత వారందరు పురాణము పఠనము చేయుచుండగా ఫెళఫెళమను శబ్దము వినిపించినది. అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి, దీపము ఆరిపోయి చెల్లచెదురుగపడివుండెను. ఆ దృశ్యము చూసి వారందరు ఆశ్చర్యముచో నిబడివుండిరి. అంతలో ఆ స్తంభమునుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని చూసి ” ఓయీ !నీవెవ్వడవు? నీవీ స్తంభమునుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి” అని ప్రశ్నించిరి. ఆ పురుషుడు అందరికి నమస్కారించి ” పుణ్యత్ములారా! నేను క్రిందటి జన్మలో బ్రాహ్మణుని, ఒక జమీందారుడను, నాపేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్యరములుండుటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని దుర్బులడనగుటచేత వేదములను చదవక, శ్రీహర్ని పూజింపక, దానధర్మలు చేయక మెలిగితిని. నేను నా పరివారముతో కూర్చున్నసమయంలో విప్రుడు వచ్చి నన్ను ఆశ్రయించిన అతనిచే నా కాళ్లు కడిగించి, ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి, నానా దుర్బాషలాడి పంపుతుండేవాడిని. స్త్రీలను, పసిపిల్లలను హీనముగా చూస్తుండేవాడిని. అందరు నా చేష్టలకు భయపడెవారు కాని నన్నెవరు మందలించలేకపోయిరి. నేను చేసే పాపకార్యములకు హద్దులేకపోయెది. దానధర్మలు ఎలాంటివో నాకు తెలియదు. ఇంత దుర్మర్గుడనై, పాపినై అవసానదశలో చనిపోయి ఘోరనరకములు అనుభవించి, లక్ష జన్మలందు కుక్కనై, పదువేల జన్మలు కాకినై, ఐదువేల జన్మలు తొండనై, ఐదువేల జన్మలు పేడపురుగునై, తర్వాత వృక్షజన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకోలేకపోయాను. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగా వున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ణానినైతిని. నా కర్మలన్నీ మీకు తెలియచేసితిని నన్ను మన్నింపండి” అని వేడుకొనెను.
ఆ మాటలాలకించిన మునులందరు ఆశ్చర్యంచెంది “ఆహా! కార్తీకమాస మహిమ ఎంత గొప్పది. అదెకాక కార్తీకశుద్ద పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కర్రలు, రాళ్లు, స్తంభములు కూడా మన కండ్లయెదుట ముక్తిపొందుతున్నాయి. వీటన్నింటికన్నా కార్తీకశుద్ద పౌర్ణమినాడు ఆకాశదీపం వుంచిన మనుజునకు వైకుంఠప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది” అని అనుకొంటుడగా ఆ పురుషుడు వీరి మాటలు ఆలకించి “మునిపుంగవులారా! నాకు ముక్తి కలుగే మార్గమేదైన గలదా? నాయి సంశయమును బాపండి” అని ప్రార్థించెను. అక్కడ వున్న మునీశ్వరులందరూ తమలో ఒకడగు ఆగీరస మునితో ” స్వామి! మీరే అతని సంశయమును తీర్చగల సమర్ధులు కవున వివరించండి అని కోరిరి. అప్పుడు ఆంగీరసుడిలా చెప్పుతున్నాడు.
రేపటి భాగంలో ఆంగీరస వివరణ.
పదహారవరోజు అధ్యాయము సమాప్తము