డెంగీ జ్వరం రేపుతున్న కలకలం …
డెంగీ జ్వరం రేపుతున్న కలకలం అంతా ఇంతా కాదు. మనదేశంలో 3.3 కోట్ల మందిలో లక్షణాలు కనిపించేంత స్థాయిలో విజృంభించగా.. లక్షణాలేవీ లేకుండా దీని బారినపడ్డవారు 10 కోట్లకు పైనే. ఇప్పుడిది వింత పోకడలూ పోతోంది. ఒకప్పుడు చిన్న పిల్లల్లో, పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా వస్తుండేది. ఇప్పుడన్ని వయసుల వారిలోనూ, గ్రామాల్లోనూ కనిపిస్తోంది. అదీ విపరీతంగా, తీవ్రంగా. సమస్య తీవ్రమైనప్పుడు ప్లేట్‌లెట్లు తగ్గటం, రక్తం చిక్కపడటం, రక్తస్రావం వంటి స్పష్టమైన లక్షణాలే కనిపించేవి. ప్రస్తుతం ఇలాంటి లక్షణాలు ఉన్నా, లేకపోయినా మెదడు, గుండె, కాలేయం వంటి అవయవాలనూ దెబ్బతీస్తూ (ఎటిపికల్) తీవ్ర సమస్యలు సృష్టిస్తోంది. కళ్లను, కీళ్లనూ దెబ్బతీస్తోంది. అందుకే జ్వరం అనగానే డెంగీయేమో అనేలా భయకంపితులను చేస్తోంది. నిజానికి నూటికి 99 శాతం మందికి డెంగీ మామూలు జ్వరంగానే వచ్చి పోతుంది. చాలాసార్లు ఇది వచ్చినట్టయినా తెలియదు. కొందరిలోనే.. కేవలం ఒక్క శాతం మందిలోనే తీవ్ర సమస్యగా పరిణమిస్తుంది. ప్రస్తుతం సంభవిస్తున్న మరణాలకు ఇదే కారణం. సరైన చికిత్స తీసుకుంటే వీటిని చాలావరకు నివారించుకోవచ్ఛు ఆ మాటకొస్తే దోమలు కుట్టకుండా చూసుకుంటే అసలు దీని బారినపడకుండానే కాపాడుకోవచ్ఛు కావాల్సిందల్లా డెంగీపై అవగాహన పెంచుకొని, అప్రమత్తంగా ఉండటమే.
ఎక్కడిదీ డెంగీ?
==============
డెంగీకి మూలం ఫ్లేవీవైరస్‌లు. వీటిల్లో డెంగీ1, డెంగీ2, డెంగీ3, డెంగీ4.. ఇలా నాలుగు ఉపజాతులున్నాయి. ఇవి ఆడ ఈజిప్టై దోమ కుట్టటం ద్వారా వ్యాపిస్తాయి. ఒక ఉపజాతి వైరస్‌తో ఇన్‌ఫెక్షన్ వస్తే జీవితంలో మరెన్నడూ తిరిగి దాంతో జ్వరం రాదు. ఇతర ఉపజాతులతో రావొచ్ఛు అంటే ఎవరికైనా జీవితంలో గరిష్ఠంగా నాలుగు సార్లు డెంగీ వచ్చే అవకాశముంటుందన్నమాట. రెండోసారి, మూడోసారి మరో ఉపజాతి వైరస్‌తో జ్వరం వస్తే చాలా తీవ్రంగా ఉండటం గమనార్హం
ఆసుపత్రిలో ఎప్పుడు చేర్చాలి?
========================
కడుపులో నొప్పి, విడవకుండా వాంతులు, పొట్టలో, ఛాతీలో ద్రవం పోగుపడటం, నిస్సత్తువ, కాలేయం పెద్దగా అవటం వంటి హెచ్చరిక సంకేతాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాలి. రక్తపోటు పడిపోవటం, విడవకుండా రక్తస్రావం అవటం, ఏదైనా అవయవం విఫలమవుతోందనే సూచనలు (ఛాతీలో నొప్పి, ఆయాసం, ఫిట్స్ వంటివి) కనిపిస్తే ఏమాత్రం తాత్సారం చేయరాదు. మధుమేహం, అధిక రక్తపోటు, పొట్టలో అల్సర్లు, రక్తహీనత గలవారితో పాటు గర్భిణులు, ఊబకాయులు, ఏడాది లోపు పిల్లలు, వృద్ధులకు డెంగీ ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఎక్కువ. అందువల్ల వీరికి లక్షణాలు అంత స్పష్టంగా లేకపోయినా ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాలి
చికిత్స- పరిస్థితిని బట్టి
================
ఒక మాదిరి డెంగీ జ్వరానికి పారాసిటమాల్ మాత్రలు ఇస్తే సరిపోతుంది. వాంతులు లేకపోతే ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని తాగించాలి. వాంతులు అవుతుంటే వాటిని తగ్గించే మందులతో పాటు ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని ఇవ్వాలి. అప్పటికీ తగ్గకపోతే.. ముఖ్యంగా పిల్లలను ఆసుపత్రిలో చేర్చి, చికిత్స చేయాలి. ప్లేట్‌లెట్లు బాగా తగ్గటం, రక్తం చిక్కబడటం వంటి హెచ్చరికల లక్షణాలు కనిపిస్తుంటే తరచూ రక్తం చిక్కదనాన్ని తెలిపే హిమటోక్రిట్/ప్యాక్డ్ సెల్ వాల్యూమ్, ప్లేట్‌లెట్ల సంఖ్యను తెలిపే రక్తపరీక్షల వంటివి చేస్తూ జాగ్రత్తగా కనిపెట్టుకోవాల్సి ఉంటుంది. నోటి ద్వారా ద్రవాలు తీసుకోలేని స్థితిలో ఉన్నా, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఎక్కువున్నా, రక్తపోటు బాగా పడిపోయినా సెలైన్ ఎక్కించాల్సి ఉంటుంది. ఊపిరితిత్తుల్లోకి ప్లాస్మా ద్రవం లీకవటం వల్ల ఆయాసం వస్తున్న కొందరికి వెంటిలేటర్ అమర్చి చికిత్స చేయాల్సి ఉంటుంది. పొట్టలో, ఊపిరితిత్తుల్లో పోగుపడిన ద్రవాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే రక్తస్రావమయ్యే ప్రమాదముంది. కాలేయం, గుండె వంటి అవయవాలు దెబ్బతిన్నప్పుడు వాటికి తగిన చికిత్సలు చేయాల్సి ఉంటుంది.