శ్రీకార్తీక పురాణము 20వ అధ్యాయము…


పురంజయుడు దురాచారుడగుట
కార్తీకమాస మహాత్యము గురించి అగస్త్య మహాముని, అత్రిమునికి జరిగిన ప్రసంగమొకటి కలదు.
పూర్వమొకప్పుడు అగస్త్యమహర్షి అత్రిమహర్షిని చూచి ” ఓ అత్రిమహాముని! నీవు విష్ణువు అంశయందు బుట్టినావు. కార్తీకమాస మహాత్యము నీకు ఆమూలాగ్రముగ తెలియును. కావున దానిని నాకు వివరింపుము” అని కోరెను. అప్పుడు అత్రిమహాముని ” కుంభసంభవా! నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమయినది, కార్తీకమాసంతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసంలో నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసియునను కలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము కలదు.
త్రేతయుగమున పురంజయుడను సూర్యవంశపురాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములను చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండ పాలించుచుండెను. అట్లుండగా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశచేతను, రాజ్యాధికార గర్వముచేతను జ్ణానహీనుడై దుష్టబుద్ది గలవాడై దయాదాక్షిణ్యాలు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని, పరమలోభియై, చోరులను చేరదీసి వారిచే దొంగతనాలు దోపిడీలు చేయొస్తు దొంగలు కొల్లగొట్టుకొచ్చిన సొమ్ములో సగము వాటా తీసుకోనుచు ప్రజలను భీతవహులను చేయించుచుండెను. ఇలా కొంత కాలం జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాభోంజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజుల చెవుల బడినది.వారు తమలో తామాలోచించుకుని, కాంభోజరాజుని నాయకునిగా చేసుకొని రథ, గజ, తురగ, పదాతిసైన్య బలాన్వితులై రహస్యమార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి, నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనముచేసి యుద్దమునకు సిద్దపడిరి.
అయోధ్యానగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకొనిన పురంజయుడు తానుకూడా సర్వసన్నద్దుడై యుండెను.అయినను ఎదుటి పక్షము వారధిక బలాన్వితులుగా ఉండుటయు తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏ మాత్రము భీతిచెందక శాస్త్రసమన్వితమైన రథమెక్కి సైన్యధిపతులను పురికొల్పి, చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్దసన్నద్దుడై వారిని యెపుర్కొన భేరి మ్రోగించి, సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రుసైన్యములపై బడెను.

20వ అధ్యాయము సమాప్తము
కార్తీకమాస 20వ రోజున ఆచరించవలసిన జపతపాది విధులు – ఫలితములు

పూజించాల్సిన దైవము → నాగేంద్రుడు
జపించాల్సిన మంత్రము → ఓం సర్పాయ మహాసర్పయ దివ్యసర్వాయపాతుమాం
నిషిద్ధములు → పాలుతప్ప తక్కినవి
దానములు → గో, భూ, సువర్ణ దానాలు
ఫలితము → గర్భదోష పరిహరణం, సంతానసిద్ధి

About The Author