ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్ష భగ్నం..
ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం ఆయన్ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి ఎమర్జెన్సీ వార్డులో వైద్య పరీక్షల అనంతరం ఏఎంసీ వార్డుకు షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. హైదరాబాద్ శివారులోని బీఎన్ రెడ్డి నగర్లో ఉన్న అశ్వత్థామరెడ్డి నివాసంలో ఆదివారం సాయంత్రం ఆయన్ను అరెస్ట్ చేశారు.శనివారం ఉదయం నుంచి ఇంట్లోనే ఆయన దీక్షకు దిగారు. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో వైద్యులు దీక్ష విరమించమని సూచించారు. ఆపై పోలీసులు బలవంతంగా ఇంట్లోకి వెళ్లి దీక్షను విరమింపజేశారు.కాగా,ఆర్టీసీ కార్మికుల సమ్మె 44వ రోజుకు చేరింది. సోమవారం హైకోర్టు ఆర్టీసీ సమ్మెపై విచారణ జరపనుంది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపేది లేదని సంస్థ ఎండీ సునీల్ శర్మ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో.. కోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠగా మారింది.