ఏపీలో ఎలక్ట్రికల్ బస్సుల తయారీ యూనిట్… ఏ జిల్లాలో అంటే..

ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రికల్ బస్సుల తయారీ యూనిట్ నెలకొల్పేందుకు వీరవాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. ఆ కంపెనీకి అనంతపురం జిల్లాలో 120 ఎకరాల భూమి కేటాయించేందుకు ఏపీ ప్రభుత్వం కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. వీర వాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏపీలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లాలో ఆ కంపెనీకి భూములు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కంపెనీ రూ.1000 కోట్ల పెట్టుబడులు పెడుతుంది. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 3వేలమందికి ఉపాధి లభిస్తుందని మంత్రి మేకపాటి తెలిపారు.

ఎలక్ట్రికల్ బస్సులు తయారు చేసే వీర వాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ప్రభుత్వం సాధారణ ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు మంత్రి తెలిపారు.

విద్యుత్ సబ్సిడీలు, నీటి సరఫరా కూడా చేయనుంది. వీర వాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2004 ఆగస్ట్ 4న ప్రారంభమైంది. ఆ కంపెనీకి కొగతం శ్రీనివాసరెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ కంపెనీకి గతంలోనే ఏపీ ప్రభుత్వం 50 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే, అది సరిపోదని, మరింత పెంచాలని కంపెనీ కోరింది. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

About The Author