కారులోనే సీక్రెట్ అర… మూడు కోట్ల నగలు రవాణా…
నెల్లూరోళ్ల తెలివి ఒక అడుగు ముందుకేసింది.. బంగారు నగలను కారులోనే ఒక సీక్రెట్ అర ఏర్పాటుచేసి రవాణాచేస్తున్నారు.
కడప రెండో పట్టణ ఠాణా పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న 6.930 కిలోల బంగారు నగలు పట్టుబడ్డాయి. పత్రాలు చూపించాలని అడగ్గా వారి వద్ద ఆ వాహనానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేవన్నారు.
వాహనాన్ని రెండో పట్టణ ఠాణాలో ఉంచారు. అనుమానం వచ్చి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా వెనుక సీటు మధ్యలో ఎవరికీ అనుమానం రాకుండా ఓ ప్రత్యేక అరను గుర్తించారు. మామూలుగా చూస్తే సీటులా ఉండగా దానిపై కవరును తొలగించి చూస్తే లాకర్ కనిపించింది. దీనిని గుర్తించిన పోలీసులు లాకర్‌ను తెరవగా అందులో 6.930 కిలోల బంగారు నగలు లభించాయి.
వీటి విలువ సుమారు రూ.3 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. కారులో ఉన్న విమల్‌కుమార్ జైన్, మనీష్‌కుమార్‌జైన్, బవేష్‌కుమార్‌జైన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నెల్లూరులోని మౌనిక బంగారు నగల దుకాణం నుంచి తీసుకొస్తున్నట్లు వోచర్ చూపించారన్నారు. వారి వద్ద అది తప్ప నగలకు సంబంధించిన ఎలాంటి బిల్లులు లేకపోవడంతో స్వాధీనం చేసుకుని వాణిజ్య పన్నుల శాఖకు అప్పగించినట్లు డీఎస్పీ తెలిపారు.
మూడేళ్ల నుంచి చేస్తున్నాం.. ‘మాది నెల్లూరు.. మూడేళ్ల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నాం. నెల్లూరులోని మౌనిక బంగారు నగల దుకాణంలో వీటిని తయారు చేసి తీసుకొచ్చి కడపలోని పది దుకాణాలకు సరఫరా చేస్తున్నాం. నగలకు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయి’ అని విమల్‌కుమార్‌జైన్, మనీష్‌కుమార్‌జైన్ చెప్పారు. ఇదేమి మోసం కాదని వివరాలు సమర్పించి సరకు తీసుకెళ్తామని చెప్పారు.