ఈవిడ పేరు రెడ్డమ్మగారు.. అందరికి పెద్దమ్మ…
తిరుపతిలో చాలామందికి బాగా పరిచయం . గత నిలబై ఏళ్లకు పై పైగా బీరివీధిలో రెడ్డమ్మ మెస్ పేరుతో నడుపుతున్నారు .. క్యాష్ కౌంటర్ లో ఆమె కూర్చుంటుంది .. ఆ మెస్ లో అన్నిరకాల నాన్ వెజ్ ఉంటుంది ..అరటి ఆకులో .. పోగలుగక్కుతున్న వేడివేడి అన్నంలో వేడివేడిగా కూరలు వడ్డిస్తారు ..ఇది కొంచెం రుచి చూడండి సార్ అంటూ అందులో ఉండే కుర్రాడు రెండు మూడు రకాల కూరలు వేస్తాడు .. ఆ టేస్ట్ మరింక ఎక్కడ దొరక్కపోవచ్చు ..ఒకసారి తింటే మళ్ళీ కచ్చితంగా వెళ్తారు .. ఆ మెస్ లో కమర్షియల్ హంగులు ఎం ఉండవ్ .. చాలా సాదాసీదాగా ఉంటుంది .. పాతకాలం కుర్చీలు , పాత టేబుళ్లు కనిపిస్తాయి ..
బహుశా ఆవిడకి ఎనభై ఏళ్ళు ఉండొచ్చు .. అక్కడ మెస్ కి వెళ్లి భోజనం చేసినట్టు ఉండదు .. రెడ్డమ్మగారు ఏదైనా ఫంక్షన్ కి పిలిస్తే వెళ్లి భోజనం చేసినట్టుంటుంది .. అక్కడ మనం ఉన్నంతసేపు ఆ పెద్దమ్మ అరుపులు వినిపిస్తూ ఉంటాయి .. ఆవిడ ఎవరో ఒకరి మీద పెద్దపెద్దగా అరుస్తూనే ఉంటుంది .. అయితే ఆవిడ తిట్టినట్టు ఉండదు .. చల్లగా బతకమని ఆశీర్వదిస్తున్నట్టు ఉంటుంది .. ఆమె మాటల్లో కల్మషం ఉండదు .. ఆమెకోపంలో ఆప్యాయత కనిపిస్తుంది ..బిల్లు మూడొందల అయితే ఎంత ఉంటె అంత ఇచ్చేసి వెళ్లు నాయన అంటుంది .. లేదా ఒక యాభై తగ్గించి ఇవ్వులే అంటుంది ..
కుర్రాడివి ఒక కూరతోనే తిన్నావా .. ఇలాగైతే నీకు ఓపిక ఎలావస్తుంది పిల్లాడా అంటుంది ..
చాలామంది తిని రేపు ఇస్తాలే అంటూ వెళ్లిపోతున్నారు .. వాళ్ళ రేపు డబ్బులు ఇవ్వకపోతే అని అడిగితే .. ఇవ్వకపోయినా పర్వాలేదు నాయనా .. ఒక్కరోజు నా బిడ్డలాంటోడికి కడుపు నిండా అన్నం పెట్టాను అది చాలు అంటుంది ..రేపు పోయేటప్పుడు డబ్బులు మూటకట్టుకుని పోతామా అంటుంది ఆ పెద్దమ్మ ..తిరుపతి వెళ్తే కచ్చితంగా ఆ రెడ్డమ్మ మెస్ కి…వెళ్ళండి.. కాదు కాదు ఆ పెద్దమ్మ ఇంటికి వెళ్లి భోజనం చేసి రండి ..