తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్.


బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని, అందుకే అంతకు ముందు బీసీ డిక్లరేషన్‌తో పాటు, ఎన్నికల ప్రణాళికలో కూడా వారి కోసం పలు పథకాలు ప్రకటించిందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మంత్రివర్గంలో ఆయా వర్గాలకు 60 శాతం పదవులు ఇచ్చామని, అయిదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఆ వర్గాలకు చెందిన వారేనని ఆయన గుర్తు చేశారు. నిరుపేద కుటుంబాల పిల్లలు బాగా బాగా చదువుకోవాలని, వారూ అన్ని రంగాలలో ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియమ్‌పై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయినా దాన్నీ రాజకీయం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారని, ఈ నిర్ణయం వల్ల సంస్కృతి పోతుందంటున్నారని సీఎం చెప్పారు. కానీ ఆ విమర్శలు చేçస్తున్న వారి పిల్లలు మాత్రం చక్కగా ఇంగ్లిష్‌ మీడియమ్‌లోనే చదువుతున్నారని ప్రస్తావించారు. కేవలం పేద పిల్లలు ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చదివితేనే సంస్కృతి పోతుందా? అని సూటిగా ప్రశ్నించారు.
ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను ఈ 5 నెలల్లోనే అమలు చేశామని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రకటించారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి డిసెంబరు 21న ఆర్థిక సహాయం చేయబోతున్నామని, అదే విధంగా జనవరి 9న అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు. ఉగాది పర్వదినం రోజున 24 లక్షల ఇళ్లస్థలాల పట్టాల పంపిణీ చేయబోతున్నామని, వాటిని అక్కా చెల్లెమ్మల పేరుతోనే ఇవ్వబోతున్నామని వివరించారు.
భారత సామాజిక విప్లవోద్యమ పిత. ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే 129వ వర్ధంతిని పురస్కరించుకుని విజయవాడలో బీసీ సంక్షేమ శాఖ నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతిబా పూలే నాడు జరిపిన పోరాటాన్ని సీఎం గుర్తు చేశారు.

ఆ పోరాటం ఒక స్ఫూర్తి
మహాత్మా జ్యోతిరావు పూలే 1890లో మరణించినా ఇవాళ్టికీ ఆయనను స్మరించుకున్నామని, అణగారిన వర్గాల కోసం ఆయన ఎంతో శ్రమించారని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ చెప్పారు. అంటరానితనం నిర్మూలన, మహిళల్లో విద్యాభ్యాసం, అణగారిన వర్గాల వారికి కూడా అవకాశాలు, హోదా సమానంగా ఉండాలని ఆనాడు మహాత్మా జ్యోతిబా పూలే ఎంతో ఆరాటపడ్డారని గుర్తు చేశారు. అప్పుడు సమాజంలో ఎన్నో కట్టుబాట్లు ఉన్నా, వాటిని వ్యతిరేకించి తన భార్య సావిత్రిని చదివించడమే కాకండా, టీచర్‌గా కూడా పని చేసేలా ప్రోత్సహించారని తెలిపారు. సామాజిక, ఆర్థిక న్యాయం కోసం నాడు పూలే, ఆ తర్వాత అంబేడ్కర్‌ ఎంతో శ్రమించారని, దానిపై ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

అలా ఆలోచించిన వారిలో
ఆరోజు నుంచి ఇవాళ్టి వరకు కొన్ని దశాబ్ధాలు గడిచినా, ఇవాళ్టికీ మనకు అన్యాయం జరుగుతోందని గళం విప్పాల్సి వస్తోందని సీఎం ప్రస్తావించారు. మహాత్మా జ్యోతిబా పూలే, అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని పేదల కోసం ఆలోచించిన వారు చాలా తక్కువ మంది అన్న ఆయన, వారిలో దివంగత మహానేత వైయస్సార్‌ ఒకరు అని చెప్పారు. నాడు పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం మహానేత వైయస్సార్‌ ఎంతో ఆలోచించారని, వారి కోసం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, నిరుపేదలు కూడా బాగా చదువుకోవాలని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేశారని గుర్తు చేశారు.

బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌ బోన్‌
‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పరిస్థితిని నా సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో స్వయంగా చూశాను. అందుకే వారి కష్టాలు తీర్చాలని, బీసీలు అంటే బ్యాక్‌వర్డ్‌ కాదని, బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని చెబుతూ, పాదయాత్ర తర్వాత ఏలూరు బీసీ గర్జన సభలో ఒక డిక్లరేషన్‌ ప్రకటించాను. అంతకు ముందు పార్టీకి చెందిన కమిటీ అన్ని జిల్లాలు తిరిగి అన్ని వర్గాలను కలుసుకుంది. బీసీల గురించి ఆ కమిటీ సమగ్ర అధ్యయనం చేసింది. అదే విధంగా నా పాదయాత్రలో కూడా వివిధ వర్గాల వారితో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాను. వాటన్నింటి ఆధారంగా ఏలూరులో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించాను. అప్పుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చాలని తలంచాము. అందుకే కేవలం రెండు పేజీలతోనే మేనిఫెస్టో ప్రకటించాము. అందులో బీసీల గురించి కూడా చెప్పాము’ అని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.
ఎన్నికల ప్రణాళికను ఒక బైబిల్‌లా, ఖురాన్, భగవద్గీతలా భావించామని, అందుకే అందులో చెప్పిన ప్రతి మాటను అమలు చేస్తున్నామని చెప్పారు.

60 శాతం పదవులు వారికే
అధికారంలోకి వచ్చిన వెంటనే, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ఒక అడుగు ముందుకేశామని, ఎక్కడా ఎవరూ ఊహించని విధంగా మంత్రివర్గ కూర్పులో దాదాపు 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చామని, అయిదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు వారే అని చెప్పారు.

ఆ వర్గాలకు పెద్ద పీట
‘ఇవాళ మహారాష్ట్రలో చూస్తే, కాంగ్రెస్‌కు స్పీకర్‌ పదవి, ఎన్సీపీకి ఒక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. కానీ ఇక్కడ అయిదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. వారిలో నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గానికి చెందిన వారు. బీసీ సంక్షేమం కోసం రూ.15 వేల కోట్లు ఇచ్చాము. ఎప్పుడూ, ఎక్కడా చూడని విధంగా ఒక చట్టం చేశాము. నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చే పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం ఇచ్చేలా చట్టం చేశాము’.
‘గతంలో కేవలం పలుకుబడి ఉన్న వారే మార్కెట్‌ కమిటీలకు చైర్మన్‌లుగా ఎన్నికయ్యే వారు. కానీ ఇవాళ కృష్ణా జిల్లాలో 19 మార్కెట్‌ కమిటీలు ఉంటే, వారిలో 10 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వచ్చేలా చట్టం చేశాము. అదే విధంగా ఆలయాల ట్రస్టు బోర్డులలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం ఇవ్వబోతున్నాము. ఆ విధంగా వారిని రాజకీయంగా ఎదిగేలా చేస్తున్నాము. చివరకు అసెంబ్లీ స్పీకర్‌ కూడా ఒక బీసీ’.
‘ప్రతి అడుగులో ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుడుతూ ముందుకెళ్తున్నాము. ఈ 5 నెలల్లో ఎవరూ ఊహించని విధంగా చట్టం చేశాము. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చట్టం చేశాము. ఈ 5 నెలల్లో దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము. దేశంలో ఇప్పుడు ఆర్థిక మాంద్యం కొనసాగుతోంది. కానీ ఏపీలో మాత్రం ఆ లెక్కలు వేరుగా ఉన్నాయి. ఉద్యోగాలు పోవడం కాదు. కొత్తగా వస్తున్నాయి. ప్రతి 2 వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చాము. ఈ 5 నెలల్లో ఇచ్చిన దాదాపు 4 లక్షల ఉద్యోగాల్లో 1.30 లక్షలు శాశ్వత ఉద్యోగాలు. వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్నారు’ అని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.

అప్పుల రాష్ట్రం ఇచ్చారు. అయినా..
చంద్రబాబు పదవి నుంచి దిగిపోతూ వనరులు ఉన్న రాష్ట్రం కాకుండా, ప్రతి అడుగులో అప్పులు పెట్టి పోయాడని, ఎక్కడా నిధులు లేని రాష్ట్రం ఇచ్చాడని సీఎం చెప్పారు. అయినా ఎవరికీ ఏదీ ఎగ్గొట్టకుండా దేవుడు, ప్రజలపై నమ్మకం ఉంచి అడుగులు వేశామని అన్నారు.
దాదాపు 46 లక్షల రైతులకు పెట్టుబడి సహాయం చేశామని, తొలిసారిగా కౌలు రైతులకు ఇచ్చామని వెల్లడించారు. దాదాపు 2.36 లక్షల ఆటోలు, క్యాబ్‌ల డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందరి చల్లని దీవెనలతో ఇవ్వగలిగామని తెలిపారు. ఇంకా మొన్నటికి మొన్న మత్స్యకార సోదరులకు కూడా ఆర్థిక సహాయం చేశామని వివరించారు.

రూ.1400 కోట్ల పెన్షన్లు
చంద్రబాబు తన 5 ఏళ్ల పాలనతో పెన్షన్ల కింద సగటున నెలకు రూ.500 కోట్లు ఇవ్వగా, తమ ప్రభుత్వం అక్షరాలా రూ.1400 కోట్లు ఇస్తోందని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడించారు. ఆ విధంగా అందరి దీవెనలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.

స్కూళ్లలో సంస్కరణలు
ఇంకా మరో గొప్ప కార్యక్రమం మనబడి. నాడు–నేడు అన్న సీఎం, కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నామని చెప్పారు. ఇవాళ స్కూళ్లలో దారుణ పరిస్థితి నెలకొందని, పిల్లలకు టాయిలెట్లు లేవని, పుస్తకాలు ఇవ్వడం లేదని, మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లించడం లేదని గుర్తు చేశారు. ఈ పరిస్థితులన్నింటినీ మారుస్తూ, ‘మనబడి నాడు–నేడు’ చేపట్టామని, అంతే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు.

సంస్కృతి పోతుందా?
‘ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియమ్‌పై నిర్ణయాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ పత్రికాధిపతులు, పెద్ద పెద్ద నాయకులు తమ పిల్లలను ఇంగ్లిష్‌ మీడియమ్‌లోనే చదివిస్తున్నారు. కానీ మన పిల్లలు ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చదివితే సంస్కృతి పోతుందంటున్నారు. వాళ్లు మాత్రం ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చదవాలి. కానీ సంస్కృతి పోదు. కానీ మనం ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చదివితే సంస్కృతి పోతుందట. అంత దారుణంగా పరిస్థితి ఉంది’ అని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.

నిరుపేదల పిల్లల కోసం
ఇంకా వచ్చే జనవరి 9న అమ్మ ఒడి పథకం చేపడుతున్నామని, నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను బడికి పంపిస్తే, ఆ తల్లికి ఏటా రూ.15 వేలు ఇస్తామని తెలిపారు. చదువులు ఎండమావి కాకూడదన్న లక్ష్యంతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నామని, మరో నాలుగు అడుగులు ముందుకేస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయడమే కాకుండా వసతి దీవెన కార్యక్రమంలో ఆ పిల్లలకు హాస్టల్‌ ఖర్చుల కింద రూ.20 వేలు ఇవ్వబోతున్నామని వెల్లడించారు.
ఇంకా..
‘డిసెంబరు 21 నా పుట్టినరోజు. ఆరోజు చేనేతకారులకు ఆర్థిక సహాయం చేయబోతున్నాము. మగ్గం ఉన్న ప్రతి చేనేతకారుడు, ప్రతి చేనేత కుటుంబానికి అండగా ఉండే విధంగా గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఇంకా ఉగాది రోజున దేశంలో ఎక్కడా లేని విధంగా 24 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నాము. గత ప్రభుత్వం పేదలకు ఫ్లాట్ల పేరుతో అవినీతికి పాల్పడింది. అందుకే అక్కా చెల్లెమ్మల పేరుతో ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్‌ చేస్తూ, వారికి ఇవ్వబోతున్నాము’ అని ముఖ్యమంత్రి వివరించారు.
వీటన్నింటి కోసం అందరి దీవెనలు, ఆశీస్సులు కావాలంటూ సీఎం తన ప్రసంగం ముగించారు.
ఉప ముఖ్యమంత్రి శ్రీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు శ్రీ మోపిదేవి వెంకటరమణ, శ్రీ జి.జయరాం, శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్, శ్రీ ఎం.శంకర నారాయణ, ఎమ్మెల్సీ శ్రీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు శ్రీ జోగి రమేష్, శ్రీ మల్లాది విష్ణు, శ్రీ పార్థసారథి, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ శ్రీమతి వాసిరెడ్డి పద్మతో పాటు, పలువురు అధికారులు, అనధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About The Author