అమ్మా ప్రియాంకా… ఏంది తల్లీ ఈ దారుణం…
ఉన్నత విద్యావంతురాలివే కదమ్మా…ఇంత అన్యాయంగా బలైపోయావేందమ్మా…
ఆ నరరూప రాక్షసుల నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఎన్నో అవకాశాలున్నా అంత అమాయకంగా కాలి బూడిదైపోయావేం తల్లీ…
నీ భద్రత విషయంలో అనుమానం రాగానే 100 డయల్ చేసి పోలీసులను ఆశ్రయించినా ఈ దారుణం జరుగకపోవును కదమ్మా…
వాట్సప్ లో నీ లైవ్ లొకేషన్ షేర్ చేసి, ఇంట్లో వాళ్ళనో,ఫ్రెండ్స్ నో నువ్వున్న చోటికి ఎదురు రమ్మని అడిగినా బతికిపోయేదానివి కద తల్లీ…
నీ మనసు కీడు శంకించగానే ఎవరి సాయం కోరినా…శంషాబాద్ ఇంటి నుంచి బయల్దేరినా గంటలోపే నిన్ను చేరుకునేవాళ్ళు…కాపాడుకునేవాళ్ళు…
నీకు హాని చేసే అవకాశం ఉందని అనుమానం వచ్చిన వ్యక్తుల ఫోటోలను వాట్సప్ లో షేర్ చేయగలిగినా ఆ ప్రమాదం తప్పిపోయేది కదా తల్లీ…
సమీపంలోని టోల్ ప్లాజా దగ్గర వెయిట్ చేస్తే వచ్చేపోయే వాళ్ళు వింతగా చూస్తారేమో అని ఇబ్బంది పడ్డావ్ కానీ ఆ దుర్మార్గుల చేతిలో విగతజీవిగా మారే ప్రమాదాన్ని ఊహించలేకపోయావేందమ్మా…
వరంగల్ నీలాంటి మరో ఆడపిల్ల పుట్టినరోజు నాడే కామాంధుల కర్కశత్వానికి బలైపోయింది…
ఆ తల్లిది ఇంకా దారుణం… తెలిసిన వాడే నమ్మించి గొంతు కోశాడు…
మన నీడనే మనం నమ్మకూడని రోజులు తల్లీ…
కడుపున పుట్టిన కూతురుకు కన్నతండ్రి దగ్గర సైతం రక్షణ కరువైన దరిద్రపు కాలమమ్మా…
అమ్మల్లారా…సమాజాన్ని ఆడపిల్లల భద్రతకు అనుగుణంగా మార్చుకోవడం అంత సులువైన పని కాదు…కానీ వ్యక్తిగతంగా కొన్ని జాగ్రత్తలు ఎవరికి వారు తీసుకోగలిగితే సమాజంలోని నరరూప రాక్షసుల పంజా నుంచి మనల్ని మనం కొంతమేరకైనా కాపాడుకోగలం.
నేటి సమాజంలో ఆడపిల్లలకు ఎదురవుతున్న సమస్యలు, వాటిని ఎదుర్కొనే అవకాశాల గురించి చిన్నతనం నుంచే అవగాహన కల్పిస్తూ పెంచాలి.
స్మార్ట్ ఫోన్ లో సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్నంత మాత్రానా మనకు అన్నీ తెలుసనే ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ప్రాక్టికల్ గా ఒక ప్రమాదం ఎదురైతే…అత్యవసర పరిస్థితుల్లో కనీసం 100 నంబర్ కు డయల్ చేయాలన్న స్పృహను పెంచుకోవాలి.
అమ్మాయిలు అమాయకత్వాన్ని నటిస్తే ఎదుటివారికి ఇంప్రెసివ్ గా కనిపించొచ్చు కానీ…ముంచుకొస్తున్న ప్రమాదాన్ని తెలివిగా డీల్ చేయలేకపోతే అంతే అమాయకంగా బలైపోతాం.
పోలీసులు మహిళల భద్రత విషయంలో అవగాహన కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగించాలి.
ఆడపిల్లల భద్రత కోసం అవసరమైన ముందు జాగ్రత్తలను కుటుంబ స్థాయిలోనే మొదలెట్టాలి. సమాజంలో జరుగుతున్న పరిణామాలపై కుటుంబమంతా కూర్చుని మంచీ చెడూ వివరించుకుంటూ మాట్లాడుకోగలగాలి.
నేను మరో ప్రియాంకలా బలి కాను…నేను మరో మానసలా రాలిపోను…అనే ఆత్మవిశ్వాసాన్ని మన చిట్టి తల్లులందరికీ అందించే బాధ్యత మనదే.
మీరేమంటారు.