శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి పట్టువస్త్రాల సమర్పణ
తిరుపతి, 2019 డిసెంబరు 01: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులకు టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.
అనంతరం గౌ|| ఉప ముఖ్యమంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గౌ. శ్రీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం టిటిడి అన్ని వసతులు కల్పించిందన్నారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బోర్డు సభ్యురాలు శ్రీ మతి ప్రశాంతిరెడ్డి, ఆదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్వో శ్రీ ప్రభాకర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ఆగమ సలహాదారు శ్రీ కాండూరి శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏవిఎస్వో శ్రీ నందీశ్వర్‌రావు, సూపరింటెండెంట్ శ్రీ గోపాలకృష్ణారెడ్డి, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ కోలా శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు.