ఆ కుటుంబానికి ఏం హామీ ఇవ్వగలం మోదీ గారు.. కేటీఆర్
హైదరాబాద్ : మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి తక్షణమే శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే దేశంలో ప్రస్తుతం ఉన్న చట్టాలకు సవరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయం ఆలస్యం అయితే అన్యాయం జరిగినట్టేనని అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ా నరేంద్ర మోదీ గారు.. నిర్భయ ఘటన జరిగి 7 ఏళ్లు అయింది.. కానీ దోషులకు ఇప్పటికీ ఊరి శిక్ష విధించలేకపోయాం. ఇటీవల తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం జరిగింది.. ఈ కేసులో దోషులకు దిగువ కోర్టు ఊరి శిక్ష విధించింది. కానీ హైకోర్టు దానికి జీవిత ఖైదుగా మార్చింది. తాజాగా హైదరాబాద్‌లో యువ పశు వైద్యురాలిని అనాగరికంగా హత్య చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. కానీ న్యాయం కోసం దు:ఖిస్తున్న బాధితురాలి కుటుంబానికి ఏం హామీ ఇవ్వగలం. న్యాయం ఆలస్యం కావడం అంటే అన్యాయం జరిగినట్టే. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే.. ఇలాంటి ఘటనలపై ఒక రోజంతా చర్చ చేపట్టాలి.
ఐపీసీ, సీఆర్‌పీసీలకు సవరణలు చేయాలి. మహిళలపై, పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనల్లో దోషులుగా తెలినవారికి వెంటనే ఊరి శిక్ష విధించాలి. దీనిపై సమీక్షకు ఆస్కారం లేకుండా చూడాలి. మన పురాతన చట్టాలను సవరించాల్సిన సమయం వచ్చింది. చట్టాలకు భయపడకుండా దారుణాలకు పాల్పడే జంతువుల నుంచి మన దేశాన్ని కాపాడుకోవడానికి వేగంగా చర్యలు చేపట్టాల్సి ఉంది. చట్టాలను సవరించి.. వీలైనంత వేగంగా న్యాయం జరగాలని కోరుకుంటున్న కోట్లాది మంది ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాన్ణని కేటీఆర్ తెలిపారు.