అత్యంత అరుదైన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం – ఒకే శిలలో ఐదు రూపాలు!


మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు.అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే ” సంభవామి యుగే యుగే “ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం

ఓంకారానికి అర్థాన్ని చెప్పి శివయ్యకు గురువుగా మారినా… సేనాధిపతుల్లో స్కందుడిని నేనంటూ కృష్ణపరమాత్ముడే కొనియాడినా… అవన్నీ సుబ్రహ్మణ్యస్వామి విశిష్టతలను చాటిచెప్పేవే. అటువంటి స్కందుడు తల్లిదండ్రులతో సోదరుడితో కలిసి వెలసిన క్షేత్రం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం.

‘ఏక శిల ఏక పడగ సప్త శిరస్సాసన శ్రీచక్రసహిత మయూర గణపతి శివ సుబ్రహ్మణ్యేశ్వర నమః’ అనే శ్లోకంతో ఆ క్షేత్రంలో పూజలు ప్రారంభమవుతాయి. ఒకే శిలలో ఐదు రూపాలతో దర్శనమిచ్చే ఈ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని పంపనూరు గ్రామంలో కొలువై ఉంది. ధన ధాన్యాలనూ, జ్ఞానాన్నీ, ఆరోగ్యాన్నీ అందించే వరప్రదాతగా అక్కడ స్వామి ప్రసిద్ధిచెందాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే మంజునాథ, పార్వతీదేవి విగ్రహాలూ దర్శనమిస్తాయి. సుమారు అయిదు వందల సంవత్సరాల కిందట శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీవ్యాసరాయలు సర్ప స్వరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించి, దేవాలయాన్ని నిర్మించాడు. పూర్వం యోగులూ, మహర్షులూ తపస్సును ఆచరించిన ఈ తపోవనంలో ఏడు (సప్త) కోనేర్లు ఉండేవట. ప్రస్తుతం వీటిలో ఆరు కోనేర్లు శిథిలం కాగా.. దేవాలయం తూర్పు దిక్కున ఒక కోనేరు మాత్రమే మిగిలి ఉంది. కాలక్రమంలో ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. తర్వాతి కాలంలో ఆలయ జీర్ణోద్ధరణ పనులకు అనంతపురానికి చెందిన ఉపాధ్యాయుడు మధుసూదన శాస్త్రి శ్రీకారం చుట్టారు. విగ్రహం విశిష్టత, మహత్యాన్ని పలువురికి వివరించి, గ్రామస్థులూ ఇతరుల సహకారంతో విరాళాలు సేకరించి, ఆ సొమ్ముతో ఆలయాన్ని అభివృద్ధి చేశారు.

విశిష్ట రూపం
పంపనూరు క్షేత్రంలో ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏడు శిరస్సులతో దర్శనమిస్తాడు. ఇక్కడి మూలవిరాట్టును ఒకే శిలతో ఐదు రూపాలు స్ఫురించేలా మలిచారు. విగ్రహం పీఠం నుంచి శిరసు వరకూ ఒక్కో రూపం ఒక్కో దేవతను సూచిస్తుంది. ఇందులో పీఠం భాగంలో శ్రీచక్రం పార్వతీదేవికీ, ఆపై భాగంలో చుట్టలు చుట్టేసినట్లుగా కనిపించే సర్పం నాగేంద్రుడికీ, సర్పరూపంలోని చివరి భాగం వక్రతుండుడి ఆకారంలో గణపతికీ ప్రతీకలుగా నిలుస్తున్నాయి. మూలవిరాట్టు మధ్యభాగం శివలింగంగా దర్శనమిస్తుంది. సర్పం శిరస్సు భాగం ఏడు తలలతో పడగవిప్పిన నాగేంద్రుడిగా దర్శనమిస్తాడు. ఈ రూపమే సుబ్రహ్మణ్యేశ్వరుడిగా పూజలందుకుంటోంది. మూలవిరాట్టుకు ఇరువైపులా నెమలి పింఛాలతో కూడిన చక్రాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడి మూలవిగ్రహం ఐదు శక్తి రూపాలతో వెలసి ఉండటం, శివుడూ పార్వతి, గణపతి, షణ్ముఖుడు, నాగేంద్రుడు… ఇలా శివుడి పరివారమంతా ఒకే చోట, ఒకే విగ్రహంలో దర్శనమివ్వడం ఇక్కడి విశేషం.

శ్రావణం ప్రత్యేకం
ఈ క్షేత్రంలో ప్రతి శ్రావణ, కార్తీక, మాఘ మాసాల్లో విశేషమైన ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రధానంగా శ్రావణ మాసంలో శతసర్ప క్షీరాభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణం, అష్టోత్తర కలశాభిషేకం, మూలవిరాట్టుకు అఖండ అన్నాభిషేకాన్ని జరిపిస్తారు. కార్తికమాసం మూడో ఆదివారం ఉసిరి చెట్టు, తులసీమాత, బృందావనానికి తులసీదామోదర కల్యాణోత్సవం జరిపిస్తారు. అదేరోజు ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రతి మాఘమాసం రెండో ఆదివారంనాడు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర ఉత్సవమూర్తులకు కల్యాణోత్సవం వైభవోపేతంగా జరుగుతుంది. మహా శివరాత్రి రోజున ఆలయానికి ఉత్తరాన ఉన్న కైలాసద్వార ప్రవేశం కల్పిస్తారు. ఇవే కాకుండా ప్రధాన పండగలైన ఉగాది, సంక్రాంతి, దీపావళి, దసరా, నాగులచవితి, షష్ఠి రోజుల్లో ప్రత్యేక అభిషేకాలూ, విశిష్ట అలంకరణలూ, విశేష పూజలూ నిర్వహిస్తారు. ప్రతి నెలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైన శుద్ధ షష్ఠి తిథిలో అభిషేకం, సహస్రనామార్చన, కల్యాణోత్సవం నిర్వహిస్తారు. పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు చేస్తారు.

ఇలా చేరుకోవచ్చు
పంపనూరులో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అనంతపురం నుంచి కల్యాణదుర్గం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై 18 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉందీ ఆలయం. బస్టాండ్‌ నుంచి నేరుగా ఆలయానికి బస్సు సౌకర్యం కూడా ఉంది. అనంతపురం నుంచి కల్యాణదుర్గం, రాయదుర్గం వెళ్లే ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో పంపనూరు చేరుకుని అక్కడి నుంచి ఆటోల్లో ఇక్కడికి రావచ్చు. శ్రావణ, కార్తిక, మాఘమాసాలూ, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది.

About The Author