పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్‌కు మరణశిక్ష…
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్‌కు మరణశిక్షను విధించారు. దేశద్రోహం కేసులో ఆయనకు ఈ శిక్ష ఖరారైంది. 2007, నవంబర్ 3వ తేదీన దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించిన కేసులో ముషర్రఫ్‌ను దోషిగా తేల్చారు. ఇస్లామాబాద్‌లోని ప్రత్యేక కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. త్రిసభ్య ధర్మాసనం ముషర్రఫ్‌కు మరణశిక్షను విధిస్తూ 2-1 తేడాతో తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పుకు సంబంధించిన పూర్తి పాఠాన్ని మరో 48 గంటల్లో రిలీజ్ చేయనున్నారు. మాజీ నియంత ముషర్రఫ్ దేశద్రోహానికి పాల్పడినట్లు కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. 2007, నవంబర్ మూడవ తేదీన ముషర్రఫ్ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినట్లు కోర్టు చెప్పింది. 2013, నవంబర్ 20వ తేదీన ఈ కేసులో విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. 2014, మార్చి 31వ తేదీన ఈ కేసులో ముషర్రఫ్‌ను నిందితునిగా చేర్చారు. జూన్ 19, 2016లో కోర్టు మాజీ అధ్యక్షుడిని నేరస్థుడిగా తేల్చింది. మాజీ ఆర్మీ జనరల్ ముషర్రఫ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. దేశద్రోహం కేసు 2013 నుంచి పెండింగ్‌లో ఉన్నది. ప్రత్యేక కోర్టుకు పెషావర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వకార్ అహ్మద్ సేత్ నాయకత్వం వహిస్తున్నారు. ఆ బృందంలో సింద్ హైకోర్టుకు చెందిన నాజర్ అక్బర్, లాహోర్ హైకోర్టుకు చెందిన జస్టిస్ షాహిద్ కరీమ్‌లు ఉన్నారు. నవంబర్ 19వ తేదీన తమ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించిన ఆ ధర్మాసనం ఇవాళ తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో దాఖలైన అదనపు పిటిషన్లను ప్రత్యేక కోర్టు కొట్టిపారేసింది. హై ట్రీజన్ కేసులో మాజీ ప్రధాని షౌకాత్ అజీజ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ హమీద్ దోగర్, మాజీ న్యాయశాఖ మంత్రి జాహిద్ హమీద్‌ను అనుమానితులుగా చేర్చాలని కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.