యాదాద్రి వైభవం…
యాదాద్రి వైభవం
యాదాద్రి ఆలయం సర్వాంగసుందరంగా రూపు దిద్దుకుంటున్నది. ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లబోతున్న యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం పూర్తి నాణ్యతాప్రమాణాలతో, అత్యంత పకడ్బందీగా నిర్మాణాలు జరుగుతున్నాయి. గర్భగుడి ఆకారం, ప్రాశస్త్యం చెక్కుచెదరకుండా పనులు కొనసాగుతున్నాయి. నిర్మాణం పూర్తయ్యాక యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అద్భుతమైన దివ్యక్షేత్రంగా భక్తులకు సాక్షాత్కారం అవుతుంది… గోపురాలు, మాడవీధులు, ప్రాకారాలు, గర్భగుడి, ధ్వజస్తంభం, శివాలయం, క్యూలైన్లు, ప్రసాద వంటశాల, పుష్కరిణి, యాగశాల.. ఇలా ప్రతి నిర్మాణం పకడ్బంధీగా సాగుతోంది.. ప్రధానాలయంలో జరుగుతున్న నిర్మాణాలన్నీ ఆధ్యాత్మికత, ధార్మికత ఉట్టిపడేలా ఉన్నాయి. గర్భగుడి ఆకారం, ప్రాశస్త్యం చెక్కుచెదరకుండా సీఎం కేసీఆర్ సూచనల ప్రకారం ప్రతిదీ నియమాలను అనుసరించి నిర్మాణం చేస్తున్నారు. రాతిశిలలను అద్భుత కళాఖండాలుగా మలిచి ఆలయ ప్రాంగణమంతా దేవతామూర్తుల విగ్రహాలతో నిండే విధంగా రూపకల్పన చేశారు. 560 మంది శిల్పులు నాలుగేండ్లుగా పడుతున్న కష్టం ఫలించి, అద్భుత ఆకారాలతో కూడిన ప్రాకారాలు సిద్ధమయ్యాయి. వందకు వందశాతం శిలలనే ఉపయోగించి దేవాలయాన్ని తీర్చిదిద్దడం యాదాద్రిలోనే సాధ్యమైంది. ఆలయ ప్రాంగణంలో పచ్చదనం పెంచేలా, ఆహ్లాదం పంచేలా ఉద్యానవనాలు పెంచుతారు. ఆలయ ప్రాంగణంలో దేవాలయ ప్రాశస్త్యం, లక్ష్మీనరసింహస్వామి చరిత్ర, స్థలపురాణం ప్రస్ఫుటించేలా తైలవర్ణ చిత్రాలను వేయనున్నారు. నమస్తే తెలంగాణ పాఠకుల కోసం ఆలయ నిర్మాణం గురించి ఫొటో ఫీచర్ ద్వారా గ్రౌండ్ రిపోర్ట్. .
…
…
కనువిందు చేస్తున్న నిర్మాణాలు
యాదాద్రిశ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని ఆధ్యాత్మిక దివ్యరాజధానిగా చేయడానికి జరుగుతున్న పనులను పరిశీలించి దిశా నిర్ధేశం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పదకొండోసారి ముఖ్యమంత్రి హోదాలో మంగళవారం యాదాద్రి కి విచ్చేస్తున్నారు. స్వయంభువులు కొలువైన ప్రధాన ఆలయ నిర్మాణం పనులు 95 శాతం పూర్తయ్యాయి. అలయం లోపల ఆశ్వార్ల విగ్రహాలు, ఆంజనేయ స్వామి ఆలయం పూర్తి చేయగా కేవలం ఫ్లోరింగ్ పనులు మిగిలి ఉన్నాయి. అష్టభుజి నిర్మాణాలు పూర్తయ్యాయి. 28 విమానాలను అష్టభుజి మండపాలపై నిర్మాణం జరిపారు. సప్త గోపురాలు అందంగా ముస్తాబు చేశారు. 100 శాతం పనులు పూర్తయ్యాయి. బ్రహ్మోత్సవం మండపంతో కలిపి ప్రధానాలయం నిర్మాణం 4.35 ఎకరాల్లో జరుగుతున్నది. ముఖమండపం భక్తులకు కనువిందు చేస్తున్నది. 32 నరసింహ అవతారాలు, ప్రహ్లాదుని చరిత్రను తెలిపే ఘట్టాలు చూడ ముచ్చటగా నిర్మాణం జరుపుకుంటున్నాయి. తూర్పున నిర్మాణం చేసిన పంచతల గోపుర ద్వారం నుంచి భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఈశాన్యంలో గల త్రితల గోపురం నుంచి శ్రీఆంజనేయస్వామి వారిని, గంఢభేరుండ నరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. పశ్చిమగోపురం… ప్రాకారాలకు గల శిల్పసంపదను ఆకట్టుకుంటున్నది. ముఖమండపంలో సహజ వెలుతురు ఉండేందుకు ముఖమండపానికి 12 సోలార్ రూప్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. నిత్యకల్యాణ మండపంలో 500 మంది భక్తులు కూర్చుని శ్రీవారిని కల్యాణాన్ని తిలకించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 3000 మంది బ్రహ్మోత్సవ మండపంలో వీక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. కొండపైన నిర్మాణమైన మొదటి ప్రాకారంలో బలిహరణం, నిత్యప్రదక్షిణలు చేసుకునే అవకాశం ఉంది. రెండో ప్రాకారంలో నిత్యకల్యాణ మండపం, యాగశాల, అద్దాల మండపం, రామానుజ కూటమి నిర్మాణమవుతున్నాయి. ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణాల్లో వీఐపీ సూట్స్ పనులు సైతం 55 శాతం పూర్తి అయ్యాయి. ఇక టెంపుల్ సిటీలో ఇన్ఫ్రా లే అవుట్ తయారు చేశారు. ఈ టెంపుల్ సిటీలో పీవీటీ వారికి గుర్తుగా భవనాల నిర్మాణాలు ఏ విధంగా చేయాలి అన్న విషయంపై డోనర్స్ తో మాట్లాడి ఒక పాలసీని సీఎం కేసీఆర్ డిసైడ్ చేస్తారు. విష్ణు పుష్కరిణి నిర్మాణం, కల్యాణకట్ట, సత్యనారాయణ స్వామి వ్రతాల నిర్మాణం విషయంలో సూచించిన సూచనల మేరకు పనులు జరిగాయా లేదా పరిశీలించనున్నారు. ఫ్రిబ్రవరి 3న యాదాద్రికి వచ్చినప్పుడు గర్భాలయం నిర్మాణంలో చేసిన పనులు ఎలా జరిగాయి..ఎంత వరకు జరిగాయి నగిషీ పనులు ఎలా చేశారు తదితర వివరాలను స్వయంగా పరిశీలించారు.
…
…
సర్వాంగ సుందరంగా బ్రహ్మోత్సవ మండపం తుది మెరుగులు
బ్రహ్మోత్సవ మండపం నిర్మాణం పనులు సర్వాంగ సుందరంగా జరిగాయి. ఆలయాన్ని కేవలం వారం రోజుల్లో పనులు పూర్తి చేశారు. వేంచేపు మండపానికి గల పనులన్నీ పూర్తయ్యాయి. శ్రీవారి సేవ ఆలయం బటయటకు వచ్చినప్పుడు వేంచేపు మండపంలో శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని అధిష్టించి భక్తులకు దర్శనం కలిగిస్తారు. ఎంతో ప్రాధాన్యత గల మండపాన్ని అన్ని హంగులతో పూర్తి చేశారు. ప్రస్తుతం బ్రహ్మోత్సవ మండపాన్ని కృష్ణశిలలతో తయారు చేసిన స్తంభాలను ఉపయోగించి నిర్మాణం చేశారు.
…
…
శయనోత్సవ మండపం పనులు పూర్తి
ఆండాల్ అమ్మవారి ఆలయం పక్కన శయనోత్సవ మండపం నిర్మాణం చేసే పనులు 9/9 సైజులో ఆలయ నిర్మాణం పనులు పూర్తి చేశారు. నెల రోజుల్లో ఆలయ నిర్మాణం పనులు పూర్తి చేశామని ప్రధాన స్థపతి డాక్టర్ ఆనందాచార్యుల వేలు తెలిపారు. శ్రీవారికి వివిధ సమయాల్లో సమర్పించే భోగాలు, ఆరగింపు సమయాల్లో సమర్పించే మహాప్రసాదం తయారు చేసేందుకు నిర్మాణం చేసిన రామానుజ కూటమిలో మిగిలిపోయిన పనులను చేపట్టారు. కిటీకీలను కలపతో తయారు చేసినవి వాడగా వాటిని తొలగించి రాతితో తయారు చేసిన కిటికీలను అమరుస్తున్నారు. ద్వితీయ ప్రకారం ఈశాన్యంలో ఉన్న రహదారిని మూసి వేసి పనులను వేగవంతం చేశారు. ఈశాన్య ద్వారంలో మిగిలిపోయిన పనులు కూడా వారంలో పూర్తవుతాయి.
…
ఆకర్షణీయంగా కృష్ణశిలలతో జరిగిన మాడవీధుల ఫ్లోరింగ్
ఆలయ నిర్మాణానికి మొత్తం కృష్ణశిలలను ఉపయోగించారు. అదేవిధంగా ప్రధమ, ద్వితీయ ప్రాకారాలలోని తిరువీధులు మొత్తం కృష్ణశిలలతోనే ఫ్లోరింగ్ చేస్తు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా మాడవీధులను కూడా కృష్ణశిలలతో నిర్మాణం చేయనున్నారు. రూ. 6 కోట్లతో ఫ్లోరింగ్ పనులు చేపట్టారు. మొత్తం 83, 000 ఫీట్ల ఎస్ఎఫ్టీలో కృష్ణశిలలతో ఫ్లోరింగ్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 40, 000 ఫీట్ల ఎస్ఎఫ్టీ పనులు జరిగాయి. మొదటగా ఆలయానికి నైరుతి దిశలో పనులు ప్రారంభించారు. తూర్పు మాఢవీధి వరకు ఫ్లోరింగ్ శిలలను అమర్చారు. తాజాగా పడమర, దక్షిణం, తూర్పు దిశల వరకు ఫ్లోరింగ్ పనులు పూర్తికావస్తుండటంతో ఆలయ ప్రాంగణమంతా చూడముచ్చటగా రూపుదిద్దుకుంటున్నది.
…
…
శిల్పి పనులకు తుది మెరుగులు
శిల్పి పనులకు తుది మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయి. రాతి శిలలకు తమ ఉలులతో ప్రాణం పోసి అద్భుత రాతి శిలలను ఆవిష్కరించి నిర్మాణం పూర్తి చేసిన శిల్పులు తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణతో ఆలయాభివృద్ధికి శ్రీకారం పలుకుడంతో యాదాద్రికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. పర్యాటక రంగాన్ని ఆలయాభివృద్ధికి అనుసంధానం చేయడంతో యాదాద్రి సర్కిల్ పర్యాటక రంగానికి ఊతమిచ్చే స్థాయికి చేరుకుంటున్నది. ఆధారశిల నుంచి మహానాసి వరకు కృష్ణ శిలతోనే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రాజగోపురాలు నిర్మించాలన్న లక్ష్యం సంపూర్ణమైంది. అనుకున్న విధంగా అన్ని దిక్కుల్లో ఆరు రాజగోపురాలు, గర్భగుడిపై దివ్య విమానం ఆవిష్కృతమయ్యాయి. మొదటి ప్రాకారంలో తూర్పువైపున త్రితల రాజగోపురం(ప్రవేశ మార్గం), పడమర దిశలో ఐదంతస్తుల గోపురం(బయటకు వెళ్లేందుకు) రూపుదిద్దుకున్నాయి. రెండో ప్రాకారానికి పశ్చిమాన ఏడంతస్తుల మహా రాజగోపురం, తూర్పు, ఉత్తర, దక్షిణ దిశల్లో ఐదంతస్తుల రాజగోపురాలు తీర్చిదిద్దారు. వీటితోపాటు స్వయంభువులు కొలువై ఉన్న గర్భగుడిపై 42 అడుగుల ఎత్తున దివ్య విమానం(విమానం గోపురం) నిర్మాణం పూర్తవడంతో గోపురాల నిర్మాణ క్రతువు పూర్తవడంతో గోపురాల నిర్మాణ ప్రక్రియ పరిపూర్ణమైంది. గోపురాలను శిల్పాకారులు 32 నెలల్లో పూర్తి చేశారు. సప్త గోపురాల సమూహంతో కనువిందు చేస్తుండగా మరో వైపు 28 అష్టభుజి మండపాలపై 28 విమానాలను నిర్మాణం చేశారు. ప్రాకారాలపై అష్టభుజి మండపాలు… వాటిపైన అమర్చిన విమానాలు కొండంతా విమానాల సమూహమేనా అన్నట్లు భావన కలుగుతున్నది.
…
…
శివాలయం పనులు 90 శాతం పూర్తి
శివాలయం శిల్పి పనులు పూర్తయ్యాయి. గోపురం, ముఖమడపం, ప్రాకారం పనులు కూడా పూర్తయ్యాయి. శివాలయానికి వైట్ ప్రైమర్ వేసే పనులను అధికారులు చేపట్టారు. శివాలయంలో ప్రాకారం లోపల ఫ్లోరింగ్ చేసే పనులు ప్రారంభించారు. శివాలయంలో కూడా ఫ్లోరింగ్ పనులు మొదలయ్యాయి. పడమర నుంచి తూర్పు ముఖ మండపం వరకు ఫ్లోరింగ్ పనులు పూర్తయ్యాయి. ఉత్తరం వైపున నిర్మాణం చేయాల్సిన గోడల పనులు కూడా శరవేగంగా జరగుతున్నాయి. సమాంతరంగా తూర్పు వైపున గోడల నిర్మాణం కూడా చేపట్టారు.
…
…
అధునాతన పద్దతిలో కారుపార్కింగ్
ఉత్తర భాగంలో కారుపార్కింగ్కు కూడా వైటీడీఏ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేశారు. 3000 నుంచి 5000 వాహనాలు పార్క్ చేసేందుకు అవసరమైన ప్లాన్‌ను సిద్దం చేశారు. రెండంతస్తుల్లో దీన్ని నిర్మాణం చేయాలని భావిస్తున్నారు. కార్ల పార్కింగ్ ఇప్పటి వరకు ఒక పద్దతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కారు పార్కింగ్ నుంచి నేరుగా బస్‌స్టేషన్ చేరుకుని అక్కడి నుంచి సుళువుగా కొండపైకి చేరుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు.
అన్నదానం కోసం భారీ సత్రం నిర్మాణం..
యాదాద్రిలో అధునాతన పద్దతిలో భారీసత్రం నిర్మాణం చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు. ఎంత మంది భక్తులు భోజనం చేయడానికి వచ్చినా హాయిగా భోజనం చేసి వెళ్లే విధంగా సత్రం నిర్మాణం చేయనున్నారు. అత్యంత ప్రాధాన్యత గలిగిన నిర్మాణాలన్ని కొండకు ఉత్తరం వైపుకు వస్తుండటంతో ఆ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడనుంది.
గుట్ట చుట్ట రింగ్ రోడ్డు
రూ. 142 కోట్లతో నిర్మాణం కానున్న యాదాద్రి రింగ్ రోడ్డు నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పచ్చిమ పైపు నుంచి మొదలైన పనులు తూర్పుదిశ వరకు పూర్తయ్యాయి. దక్షిణం వైపున వైకుంఠద్వారం నుంచి పనులు మొదలయ్యాయి. తులసీవనం వనం పక్క నుంచి గండి చెరువు వరకు పనులు యుద్దప్రాతిపదికన జరుగుతున్నాయి.