బావల వేధింపులే కారణం..యువతి ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ..
అడ్డగుట్ట: తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అదృశ్యమై హుస్సేన్ సాగర్‌లో శవమై తేలిన మౌనిక(రాణి) ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆమె స్నేహితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారం రోజుల పాటు పలు కోణాల్లో విచారించారు. కాల్ డేటా, సీసీ ఫుటేజీలను పరిశీలించగా మౌనిక ఆత్మహత్యకు ఆమె కుటుంబసభ్యుల్లో ఇద్దరు బావలు, ఇద్దరు అన్నలే కారణమని తేలింది. తుకారాంగేట్ ఇన్స్పెక్టర్ ఎల్లప్ప కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి… బుద్ధానగర్ ప్రాంతానికి చెందిన మాచర్ల అంజయ్య కుమార్తె మౌనిక మారేడుపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. గత నెల 21న ఉదయం కాలేజీకి వెళ్లిన మౌనిక తిరిగి రాలేదు. దీంతో ఆమె సోదరుడు సాయికుమార్ తుకారాంగేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా 23న రాంగోపాల్‌పేట్ పీఎస్ పరిధిలోని హుస్సేన్ సాగర్‌లో మౌనిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న లేక్‌పోలీసులు మృతదేహాన్ని ‘గాంధీ’ మార్చురీకి తరలించారు. దీనిపై సమాచారం అందడంతో తుకారాంగేట్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉండగా తమ కుమార్తె ఆత్మహత్యపై విచారణ చేపట్టాలని కోరుతూ మృతురాలి కుటుంబసభ్యులు మృతదేహంతో పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతురాలు మౌనిక చనిపోయే ముందు తన స్నేహితులు ముగ్గురికి ఫోన్ చేసి మాట్లాడినట్లు గుర్తించారు. సదరు యువకులను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అయితే ఈ కేసుతో వారికి సంబంధం లేదని తేలడంతో వారిని వదిలేశారు. కాగా మౌనిక ఆత్మహత్యకు కొద్ది సేపటి ముందు తన స్నేహితుడికి ఫోన్ చేసి బావలు, అన్నలు తనను వేధిస్తున్నారని, దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పినట్లు గుర్తించారు.. దీంతో ఆమె బావలు వడ్డె సోమశేఖర్, ఆంథోనితో పాటు అన్నలు శివకుమార్, సాయికుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇద్దరు బావల శారీరకంగా వేధిస్తుండగా, అన్నల మానసిక వేధింపుల కారణంగానే మౌనిక ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.