ఆ ఇంటి విలువ రూ 130 కోట్లు…
న్యూఢిల్లీ : ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ప్రముఖ రచయిత సల్మాన్ రష్ధీ పూర్వీకులకు సంబంధించిన ఇంటి విలువను రూ 130 కోట్లుగా ఢిల్లీ హైకోర్టు నిర్ణయించింది. 1970లో కాంగ్రెస్ నేతకు రష్ధీ తండ్రి ఈ ఇంటిని అమ్మేందుకు సిద్ధపడగా ఇరు పక్షాల మధ్య నెలకొన్న వివాదంతో ఆ ఒప్పందం నిలిచిపోయింది. ఈ వివాదం సర్వోన్నత న్యాయస్ధానానికి చేరగా 2012లో కాంగ్రెస్ మాజీ నేత భికురాం జైన్‌కు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఉత్తర్వులు వెలువడిన నాటికి మార్కెట్ రేటు ప్రకారం ఆ ఇంటిని జైన్‌కు అప్పగించాలని రష్ధీ వారసులను కోర్టు ఆదేశించింది. ఈ ఆస్తి మార్కెట్ విలువను నిర్ధారించాలని సుప్రీం కోర్టు ఢిల్లీ హైకోర్టును కోరింది.రూ 130 కోట్లకు తమ ఇంటిని కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారు సిద్ధంగా ఉన్నారని రష్ధీ వారసులు తెలపడంతో ఇంటి మార్కెట్ ధరను ఢిల్లీ హైకోర్టు రూ 130 కోట్లుగా నిర్ధారించింది.
ఈ ధరకు ఇంటిని కొనుగోలు చేసేందుకు జైన్‌లు సిద్ధంగా లేకుంటే ఆరు నెలల్లోగా ఇతరులకు రష్ధీ వారసులు తమ ఇంటిని విక్రయించవచ్చని జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లా తెలిపారు. రూ 130 కోట్లకు ఇంటిని నిర్ధేశిత గడువులోగా రష్ధీలు అమ్మలేని పక్షంలో డిసెంబర్ 4, 2012లో సర్కిల్ రేట్లకు అనుగుణంగా రూ 75 కోట్లకు జైన్లు ఆ ఇంటిని కొనుగోలు చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక రూ 75 కోట్లకు ఇంటిని జైన్లు కొనేందుకు సుముఖత చూపనిపక్షంలో 1970లో ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందం నుంచి రష్ధీలు వైదొలగవచ్చని కోర్టు తెలిపింది. కాగా 1970లో ఈ ఇంటిని రష్ధీ తండ్రి అనీస్ అహ్మద్ రష్దీ రూ 3.75 కోట్లకు విక్రయించేందుకు భికు రామ్ జైన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. జైన్ అడ్వాన్స్‌గా రూ 50,000ను అనీస్ రష్ధీకి చెల్లించి మిగిలిన మొత్తం ఇంటి యజమాని ఆదాయ పన్ను అధికారుల నుంచి ట్యాక్స్ క్లియరెన్స్ పత్రాలు రాగానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఒప్పందంలోని అంశాలకు కట్టుబడలేదని ఇరు కుటుంబాలు ఫిర్యాదు చేసుకోవడంతో వివాదం నెలకొంది. ఇక అప్పటి నుంచి ఇరు కుటుంబాలు కోర్టులను ఆశ్రయించడంతో వివాదం వాయిదాల పర్వానికి దారితీసింది.