ఆన్లైన్లో 65,280 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల…
శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2020, ఏప్రిల్ నెల కోటాలో మొత్తం 65,280 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసినట్లు టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఆన్లైన్ డిప్ విధానంలో 10,680 సేవా టికెట్లు కాగా, ఇందులో సుప్రభాతం 7,920, తోమాల 140, అర్చన 140, అష్టదళపాదపద్మారాధన 180, నిజపాదదర్శనం 2,300 టికెట్లు ఉన్నాయన్నారు. ఆన్లైన్ జనరల్ కేటగిరిలో 54,600 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 1,500, కల్యాణం 12,825, ఊంజల్‌సేవ 4,050, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,425, వసంతోత్సవం 13,200, సహస్రదీపాలంకారసేవ 15,600 టికెట్లు ఉన్నాయని వివరించారు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.
1. వేంకటేశ్వరరావు – ఏలూరు, శ్రీనివాస్ – నల్గొండ
ప్రశ్న: శ్రీవారి లడ్డూ తయారీలో కుంకుమ పువ్వు కలిపి నాణ్యత పెంచండి. వృద్ధులు, దివ్యాంగులకు స్వామివారి దర్శనం కల్పించండి?
ఈవో : లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించిన దిట్టంలో ఎలాంటి మార్పులు చేయలేదు. పోటు సిబ్బందితో చర్చించి నాణ్యత పెంచుతాం. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న పర్వదినాలు, ఉత్సవాల రోజుల్లో మాత్రమే వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నాం. రోజువారీ 1400 టోకెన్లతోపాటు నెలలో రెండు రోజుల పాటు అదనంగా 4 వేల టోకెన్లు జారీ చేస్తున్నాం.
2. వేంకటేశ్వరరావు – గుడివాడ
ప్రశ్న: ఎస్వీబీసీలో ఉదయం సుప్రభాతం ప్రసార సమయంలో స్వామివారిని చూపించండి?
ఈవో : సుప్రభాతం సమయంలో భక్తులు కూడా జయవిజయుల వద్దే ఉంటారు. స్వామివారిని చూపే అవకాశం ఉండదు. ఈ అంశాన్ని ఆగమపండితుల దృష్టికి తీసుకెళతాం.
3. మూర్తి – హైదరాబాద్
ప్రశ్న: పరకామణి సేవ సమయంలో సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు?
ఈవో : భక్తులతో వ్యవహరించాల్సిన విధానంపై సిబ్బందికి తరచూ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వారిలో మార్పు తీసుకొస్తాం.
4. జనార్ధన్ – తిరుపతి
ప్రశ్న: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వడలు భక్తులకు సక్రమంగా అందడం లేదు?
ఈవో : అధికారులతో తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటాం.
5. భారతి, భార్గవి – నెల్లూరు
ప్రశ్న: క్యూలైన్లలో నుండి కంపార్ట్మెంట్లలోకి వెళ్లడానికి ఎక్కువ సమయం పడుతోంది. టైంస్లాట్ టోకెన్లు పొందినా దర్శనం ఆలస్యమవుతోంది?
ఈవో : వేసవిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నపుడు ఇలాంటి సమస్య ఉంటుంది. ఇందుకోసం నారాయణగిరి ఉద్యానవనాల్లో రూ.26 కోట్లతో షెడ్లు ఏర్పాటు చేశాం. ఇక్కడ కూర్చోవచ్చు. టైంస్లాట్ టోకెన్లు పొందిన భక్తులు ముందుగా క్యూలైన్లోకి ప్రవేశిస్తుండడంతో దర్శనం ఆలస్యమవుతోంది. లేనిపక్షంలో 3 గంటలలోపు దర్శనం చేసుకోవచ్చు.
6. సుబ్రమణ్యం – విజయవాడ
ప్రశ్న: శ్రీనివాసం, మాధవంలో ఉదయం 8 గంటలకు చెక్ ఇన్ కారణంగా ఎక్కవ సేపు వేచి ఉండాల్సి వస్తోంది. విష్ణునివాసంలో గదులు ఆన్లైన్లో లేవు?
ఈవో : ఎక్కువ మంది భక్తుల కోరిక మేరకే శ్రీనివాసం, మాధవంలో ఈ విధానాన్ని పాటిస్తున్నాం. విష్ణునివాసంలో కరంట్ బుకింగ్‌లో గదులు అందుబాటులో ఉంటాయి.
7. ఆంజనేయులు – చీమకుర్తి
ప్రశ్న: వృద్ధులు, దివ్యాంగుల కౌంటర్ వద్ద సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు?
ఈవో : అక్కడి సిబ్బందికి తగిన సూచనలిస్తాం.
8. శ్రీకాంత్ – మంచిర్యాల
ప్రశ్న: ఎస్సి కాలనీలో ఆలయ నిర్మాణానికి ఆర్థికసాయం చేస్తారా?
ఈవో : టిటిడి నిబంధనలను పాటిస్తే ఆర్థికసాయం అందిస్తాం. మీకు ఫోన్లో వివరాలు తెలియజేస్తాం.
9. సాగర్ – తిరుపతి
ప్రశ్న: రాత్రివేళ బస్సులు, రైళ్లలో వచ్చే భక్తుల కోసం ఉచిత రవాణా వసతి కల్పించండి?
ఈవో : పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటాం.
10. విజయభాస్కర్ – విజయవాడ
ప్రశ్న: శ్రీవారిని దగ్గరగా చూసే అవకాశం కల్పించండి?
ఈవో : ప్రస్తుతం సాధ్యం కాని పరిస్థితి. సాధారణ రోజుల్లో భక్తులు స్వామివారిని సంతృప్తిగా దర్శించుకునేలా సహకరించాలని ఆలయ సిబ్బందికి సూచిస్తున్నాం.
11. శ్రీనివాసులు – శ్రీకాళహస్తి
ప్రశ్న: మాడ వీధుల్లోని గ్యాలరీల్లో మరో అంతస్తు నిర్మిస్తే ఎక్కవ మంది భక్తులు కూర్చునే అవకాశముంటుంది?
ఈవో : ఇలా చేస్తే భక్తులకు వాహనసేవలు సరిగా కనిపించవు.
12. వెంకటరత్నం – కడప
ప్రశ్న: ఎస్వీబీసీ ప్రసారాల మధ్యలో ప్రకటనలు తగ్గించండి?
ఈవో : ఇప్పటికే చాలా వరకు తగ్గించాం. ఇంకా తగ్గిస్తాం.
ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో పి.బసంత్‌కుమార్, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, అదనపు సివిఎస్వో శివకుమార్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ రామచంద్రారెడ్డి, ఎస్ఇ ఎలక్ట్రికల్స్ వేంకటేశ్వర్లు, ఎస్ఇ-2 నాగేశ్వరరావు, విఎస్వోలు మనోహర్, ప్రభాకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.