ఈ బామ్మ వయస్సు నాలుగేళ్లేనట .. అందుకే పెన్షన్ ఇవ్వరట..!
ఈ పొటోలో కనిపిస్తున్న ఈ బామ్మను చూస్తుంటే కచ్చితంగా 60 సంవత్సరాలు దాటి ఉంటాయని కళ్లున్న ఎవరికైనా తెలుస్తుంది. కానీ మన అధికారులకు మాత్రం ఈవిడ ఇంకా నాలుగేళ్ల పసిపాపలా కనిపిస్తుందట. అందుకే ఆమెకు కనీసం వృద్ధాప్య పెన్షన్ కూడా ఇవ్వలేమంటూ తేల్చేశారు. ఇప్పటి వరకూ వస్తున్న పెన్షన్ నిలిచిపోవడంతో ఆమె ఆయోమయంలో పడిపోయింది. అధికారులను ఆరా తీస్తే నీకు నాలుగేళ్లని సర్వే రికార్డుల్లో ఉండటంతో పెన్షన్ రాదు అంటూ బదులిచ్చారు. దీంతో తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటోంది.
కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం జోలదరాశి గ్రామానికి చెందిన కాచిరెడ్డి అశ్వర్థమ్మ (104) నివాసం ఉంటోంది. ఆధార్ కార్డులో కూడా ఈ వివరాలు అన్ని పక్కాగా ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం నాలుగేళ్ల పసిపాపకు వృద్ధాప్య పెన్షన్ ఎలా ఇస్తామంటూ నిలిపేశారు. ఆమె పేరును ఆ జాబితాలోంచి తొలగించేశారు. దీంతో అసలు విషయం ఆరాతీయగా అధికారుల సర్వే రికార్డుల్లో తప్పు దొర్లిందని తేలింది. 104 ఏళ్లకు బదులు ఒక్క 4 మాత్రమే పడటంతో అసలు సమస్య వచ్చి పడింది. దాని ఆధారంగా తనకు లబ్ధి చేకూర్చకుండా చేయడం అన్యాయమని ఆమె వాపోతోంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలని చెబుతుంటే అధికారులు మాత్రం తప్పుల తడక లాంటి జాబితా తయారు చేసి లబ్ధిదారులను వదిలేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.