నిర్భయ దోషుల ఉరికి లైన్ క్లియర్..


క్షమాభిక్ష తిరస్కరించిన రాష్ట్రపతి.. న్యూఢిల్లీ – నిర్భయ దోషుల ఉరికి లైన్ క్లియర్ అయింది. నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. ముఖేశ్‌ సింగ్‌ క్షమాభిక్ష అర్జీని నిన్న ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ హోంశాఖకు పంపిచారు. హోంశాఖ ఇవాళ ఆ పిటిషన్ ను తిరస్కరించాలని సిఫార్సు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపింది. ముఖేష్‌సింగ్ పెట్టుకున్న క్ష‌మాభిక్ష ద‌ర‌ఖాస్తును రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ తిర‌స్క‌రించిన‌ట్లు కేంద్ర హోంశాఖ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ముఖేష్ సింగ్ క్షమాభిక్ష దరఖాస్తును ఒక వేళ రాష్ట్రపతి తిరస్కరించినా దోషులకు కనీసం 14 రోజులు గడువు ఇవ్వాలన్న నిబంధన ఉండటంతో ఈ నెల 22న ఉరి శిక్ష అమలు సాధ్యం కాదని ఢిల్లీ ప్రభుత్వం, తీహార్‌ జైలు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో నిందితులు కావాలనే తమ ఉరిని వాయిదా వేసేందుకు క్షమాభిక్ష, క్యురేటివ్‌ పిటిషన్ల పేరుతో నాటకాలాడుతున్నారని నిర్భయ తల్లిదండ్రులు, పలువురు అధికారులు, సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉరిశిక్ష అమలు చేయడానికి ముందు దోషులకు తప్పనిసరిగా 14 రోజుల ఉపశమనం ఇవ్వబడుతుంది. దీంతో ఈ నెలాఖరులో గానీ లేదా వచ్చే నెల ప్రారంభంలో కానీ దోషులను ఉరితీసే అవకాశముంది. కాగా, దేశ రాజధానిలో డిసెంబర్ 16, 2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ ‌కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా..వారిలో ఒకడు… తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక వ్యక్తి మైనర్ కావడంతో… జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిలీజ్ అయ్యాడు. మిగతా నలుగురూ నిందితులు దోషులైన పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌ లు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.వారికి కోర్టు ఉరిశిక్ష విధించింంది… ఏక కాలంలో ఆ నలుగురిని ఉరి తీయాలని తన తీర్పులో పేర్కొంది.

About The Author