చనిపోయిన శిశువుకు చికిత్స డబ్బు కోసం ఆస్పత్రి నిర్వాకం!
హైదరాబాద్: ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కార్పొరేటు పిల్లల ఆస్పత్రి సిబ్బంది కాసుల కోసం కక్కుర్తి పడ్డారు. చౌటుప్పల్ సమీపంలోని డెక్కన్ తండాకు చెందిన పరమేష్ మరియు పావని ఆనే దంపతులు 25 రోజుల వయసున్న తమ పాపను ఈ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఉమ్మ నీరు తాగడం వల్ల ఏదో సమస్య వచ్చిందని తల్లిదండ్రులు వైద్యులకు తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆ చిన్నారికి పరీక్షలు నిర్వహించి, రోజుకి రూ.30 వేలు ఖర్చవుతుందని, తాము కచ్చితంగా బతికిస్తామని ఆస్పత్రిలో చేర్చుకున్నారు. ఇలా ఇప్పటివరకూ ఆ దంపతులు రూ.1.2 లక్షలు ఆస్పత్రికి కట్టారు. పాప ఆరోగ్యం బాగుందని ఇంకా డబ్బులు కట్టాలని ఒత్తిడి తెచ్చారు. ఓ సారి పాపను కుటుంబసభ్యులు వెళ్లి చూడగా, చిన్నారి అప్పటికే చనిపోయి ఉంది. దీంతో శిశువు తల్లిదండ్రులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమ పాప చనిపోయినా డబ్బు కోసం వైద్యులు చికిత్స పేరుతో మోసం చేశారని ఆరోపించారు. వారి బంధువులు కూడా అక్కడికి చేరుకొని ప్రైవేటు ఆస్పత్రి వద్ద ఆందోళన చేస్తున్నారు.