మాజీ భార్య ఇంటిముందు ఎస్పీ నిరసన.. తన బిడ్డలను ఒక్కసారి చూడాలని ..
ఈయన సామాన్యుడు కాదు .. ఐపీఎస్ అధికారి.. బెంగూళూరులో ఎస్పీగా ఉన్నారు.. ఎస్పీ అయితే ఏమి ..? ఆయన ఒక తండ్రి..
తమ కన్నబిడ్డల్ని చూడటం కోసం అర్థరాత్రి రోడ్డుపై నిరసనకు దిగిన ఆసక్తికర ఘటన ఇది. అయితే చిన్నారులను కలవడానికి నిరాకరించిన ఆ మాజీ భార్య కూడా ఐపీఎస్ అధికారిణే కావడం గమనార్హం.
ఐపీఎస్ అధికారి అరుణ్ రంగరాజన్ ప్రస్తుతం బెంగళూరులోని కాలబురగిలోని పోలీస్ అంతర్గత భద్రతా విభాగంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్‌పీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన మాజీ భార్య కూడా డీసీపీ స్థాయి అధికారిణిగా పనిచేస్తోంది. వీరిద్దరు ఛత్తీస్‌ఘడ్‌లో పనిచేస్తున్న సమయంలో వివాహం చేసుకున్నారు. అక్కడ ఉంటున్న సమయంలోనే వీరికి తొలిసంతానం కలిగింది. ఆ సమయంలోనే ఉద్యోగంలో తరచూ బదిలీలు అవుతుండటంతో భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న వీరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ ప్రయత్నంలో ఉండగానే సదరు అధికారిణి మరోబిడ్డకు జన్మనిచ్చారు. ఇద్దరు పిల్లలున్న ఈ జంటకు 2015లో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.
ఇదిలా ఉండగా.. అరుణ్ రంగరాజన్ తన ఇద్దరు పిల్లల్ని చూసేందుకు ఆదివారం సాయంత్రం బెంగళూరులోని వసంత్‌నగర్‌లో ఉంటున్న తన మాజీ భార్య ఇంటికి చేరుకున్నాడు. కానీ, ఆ మహిళా ఐపీఎస్ మాత్రం రంగరాజన్‌ను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో తన పిల్లల్ని చూసేంతవరకు అక్కడ నుంచి కదిలేదిలేదని ఇంటి ఎదుటే రంగరాజన్ బైఠాయించాడు. ఈ ఘటనతో తన మాజీ భర్త వేధిస్తున్నాడని ఆ అధికారిని కంట్రోల్ రూంకు సమాచారమిచ్చింది.
ఇద్దరూ తమ శాఖకు చెందిన వారే కావడంతో స్థానిక పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని రంగరాజన్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే రంగరాజన్ మాత్రం తన పిల్లల్ని చూసేవరకూ నిరసన కొనసాగుతుందని తేల్చి చెప్పడంతో చేసేదేమీ లేక పోలీసులు వెళ్లిపోయారు