ప్రేమికుల దినోత్సవం అట.


భోజన దినోత్సవం కానీ, స్నాన దినోత్సవం కానీ, దంత ధావన దినోత్సవం కానీ ఎవరూ జరుపుకోరు. కారణం, అవి రోజూ చేస్తాం. సంవత్సరం అంతా వేరే వేరే పనుల్లో ఉంటాం కాబట్టి, కొన్ని ముఖ్యమైన విషయాల్ని స్మరించుకోవడం కోసం కొన్ని దినోత్సవాలు జరుపుకుంటాం. ఇందులో ప్రేమను కూడా చేర్చడంలో ఉద్దేశమేమిటి? ఇవి సంవత్సరం అంతా ఉండవనా? ఉండకూడదనా? ప్రేమ అంటేనే ఎల్లప్పుడూ ఉండే ప్రీతి అని అర్థం. అలాంటప్పుడు సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే దానిని స్మరించుకోవడమేమిటి?

ఇక పోతే ప్రేమికుల దినోత్సవంనాడు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా కూడా మనకి భార్యాభర్తలు కనిపించరు, తల్లితండ్రులతోనున్న పిల్లలు కనిపించరు.
కేవలం పెళ్ళి కాని, ప్రేమ ముసుగులోనున్న జంటలు మాత్రమే కనిపిస్తారు.
అంటే భార్యా భర్తల మధ్య కానీ, తల్లి తండ్రులు మరియు పిల్లల మధ్య కానీ ఉండవలసిన ప్రేమకు ఈ రోజు ఉత్సవం కాదు. కేవలం పెళ్ళికి ముందు మోహతోనున్న యువతీ యువకులకు మాత్రమే ఈ రోజు దినోత్సవం. విశ్వహిందూపరిషత్ లాంటి సంస్థలు, ఈ జంటలకు పెళ్ళి చేసేస్తామంటే వ్యతిరేకిస్తారు కాబట్టి, వీళ్ళకు పెళ్ళి చేసుకునే ఉద్దేశం కూడా లేదని అర్థమవుతోంది. అంటే అమూల్యమైన ప్రేమ పేరుతో జరుగుతున్న ఈ ఉత్సవం, వికృత పోకడలకు పోతోందని అర్థమవుతోంది.

ఇక పోతే ఈ ఉత్సవం యొక్క నేపథ్యం.

మే 26న అబ్దుల్ కలాం గారిని గుర్తు చేసుకుంటూ ఒక దేశం సైన్స్ డే ను నిర్వహిస్తుంది. అంటే ఆ రోజున ఆయననూ, ఆయన సైన్సుకు చేసిన సేవలనూ స్మరించుకుంటూ, ఆయనను ఆదర్శంగా తీసుకున్న విద్యార్థులు ఆయనలా పైకి రావాలన్నది ఆ దేశపు ఆలోచన.

మరి ఈ ప్రేమికుల దినోత్సవానికి నేపథ్యం ఏమిటి? పరాయి వాడి భార్యను చూసి, మోహించి, దానికి ప్రేమ అని పేరు పెట్టి, ఓడిపోయిన వేలంటైన్ అనే వ్యక్తి, ఆమె భర్త చేతిలో హతమయ్యాడు. ఇతనిని ఆదర్శంగా తీసుకుని ఏం చెయ్యమని మనం పిల్లలకు నూరిపోస్తున్నాం?

మనం ఆదర్శంగా తీసుకునే వ్యక్తులు ఎలా ఉండాలి? తన భార్య కొన్నేళ్ళ పాటుగా తనతో లేకపోయినా, తనమీదున్న ప్రేమతో పరాయి స్త్రీని కన్నెత్తి చూడకుండా, తన భార్యను సాధించుకున్న తరువాతే తాను భార్యాసమేతుడై పట్టాభిషిక్తుడయ్యాడు. తరువాత అనేక కారణాల వలన తనను విడిచి పెట్టాల్సి వచ్చినా, అశ్వమేధయాగ సమయంలో ఇంకొక పెళ్ళైనా చేసుకోమని పండితులు చెప్పినా, బంగారు సీతతోనే యాగం చేసిన రాముడు, ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. అలాంటి రాముని ఆదర్శంగా తీసుకుంటే, ఏకపత్నీవ్రతం, పరాయి స్త్రీని కన్నెత్తి చూడకపోవడం వంటి మంచి లక్షణాలు మనకు అలవడతాయి.

రాముడు పట్టాభిషిక్తుడైన శ్రీరామనవమిని మనం ప్రేమికుల దినోత్సవంగా జరుపుకోవడం ముదావహం.

About The Author